KCR: ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఆశలు వదులుకున్నారా..?
రాష్ట్రమంతా కేసీఆర్ వేవ్ ఉన్నా, కారు జోరు టాప్ గేర్‌లో ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం గెలుపు ఎప్పుడూ ఊరిస్తూనే వస్తోంది. 2014, 2018లోనూ గెలుపు దక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండుసార్లూ ఆ పార్టీ గెలిచింది ఒక్కసీటు మాత్రమే.
KCR: ఖమ్మం జిల్లా ఇక కొరుకుడు పడదని కేసీఆర్ డిసైడైపోయారా..? ఖమ్మం జిల్లాపై ఆశలు వదులుకున్నారా..? అక్కడ గెలవడం కష్టమేనన్న నిర్ణయానికి వచ్చారా..? ఆ సీట్లను వదిలేసి ఎన్ని గెలవాలనే లెక్కలు వేసుకుంటున్నారా..? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా.. బీఆర్ఎస్‌కు ఓ పెద్ద ప్రశ్న. రాష్ట్రమంతా కేసీఆర్ వేవ్ ఉన్నా, కారు జోరు టాప్ గేర్‌లో ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం గెలుపు ఎప్పుడూ ఊరిస్తూనే వస్తోంది. 2014, 2018లోనూ గెలుపు దక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండుసార్లూ ఆ పార్టీ గెలిచింది ఒక్కసీటు మాత్రమే. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖమ్మం ఖిల్లా మాత్రం వశం కావడం లేదు. అయితే ఈసారి కూడా ఆ ముచ్చట తీరేలా లేదని పొలిటికల్ వర్గాలే కాదు కేసీఆర్ కూడా డిసైడైనట్లు భావిస్తున్నారు. ఈసారి ఆ ఒక్క సీటూ కూడా డౌటేనన్నది అనుమానం.
పొంగులేటి ఎఫెక్ట్ ఎంత..?
కేసీఆర్ స్వయంకృతాపరాధాలు ఖమ్మం జిల్లాపై పార్టీకి పట్టు దక్కకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది ఒక్క పువ్వాడ అజయ్ మాత్రమే. మంత్రిగా ఉన్న ఆయన కూడా ఈసారి గెలుస్తారా అంటే అవునని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. వరుస తప్పులు బీఆర్ఎస్‌కు శాపంగా మారాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి వంటి నేతను కేసీఆర్ దూరం చేసుకున్నారు. పొంగులేటి మంచి సౌండ్ పార్టీ. ఐదారు నియోజకవర్గాలకు ఫండింగ్ చేయగలరు. జిల్లా అంతటా తనకంటూ ఓ కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన వేవ్‌లోనూ 2014లో ఆయన వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. దీన్నిబట్టి ఆయన సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన భావించారు. తనకు నచ్చినా, నచ్చకపోయినా బలమైన నేతను వదులుకోవడానికి ఏ తెలివైన నాయకుడూ ఒప్పుకోడు. కానీ ఇక్కడున్నది కేసీఆర్. పోతే పోనీ అన్నట్లు వ్యవహరించారు. పొంగులేటిని దూరం పెట్టారు. కేటీఆర్‌కు ఇది ఇష్టం లేకున్నా భరించక తప్పలేదంటున్నారు. కసిమీద ఉన్నపొంగులేటి ఈసారి బీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టైనా తాను గెలవడమే కాకుండా జిల్లా మొత్తం కాంగ్రెస్ సత్తా చాటేలా చేయాలనుకుంటున్నారు. తనను అవమానించిన కేసీఆర్‌పై కసి తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
తుమ్మలను లైట్ తీసుకున్నారా..?
ఇక కేసీఆర్ చేసిన మరో తప్పు తుమ్మల నాగేశ్వరరావును దూరం చేసుకోవడం. నిజానికి తుమ్మలకు పాలేరు నుంచి సీటు ఇచ్చినంత మాత్రాన కేసీఆర్‌కు వచ్చే నష్టమేమీ లేదు. అక్కడ కందాల కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం లేదు. జిల్లాలో తుమ్మల సీనియర్ నేత. గతంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ తీసిపారేయదగ్గ నాయకుడు మాత్రం కాదు. రాజకీయాల్లో కేసీఆర్ కంటే సీనియర్. మంత్రిగా పనిచేశారు. జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. అనుచరగణం ఉంది. ఆయన పార్టీని వీడి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్‌కు అది ఎదురుదెబ్బే. అంతేకాదు తుమ్మల ప్రభావం రాష్ట్రంలో మరో ఐదారు నియోజకవర్గాలపై పడే అవకాశం ఉంది. కమ్మ సామాజికవర్గం కేటీఆర్‌పై గుర్రుగా ఉందంటున్నారు. ప్రతిసీటూ కీలకమైన ఈ సమయంలో కేసీఆర్ తుమ్మలను సైడ్ చేయడం సరైనదేనా అన్నది పార్టీ వర్గాల ప్రశ్న.
కమ్యూనిస్టులతో సున్నం..
కమ్యునిస్టులను దూరం చేసుకోవడం కేసీఆర్ చేసిన మరో మిస్టేక్ అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లకు ఎంతో కొంత పట్టుంది. ఒకప్పుడు ఆ జిల్లా వారికి కంచుకోట. తర్వాత డీలా పడ్డా నిర్ణయాత్మక స్థాయిలో వారికి ఓట్లున్నాయి. ఇప్పుడు వారు కనుక కాంగ్రెస్ చేయి పట్టుకుంటే కారు పంచర్ కాక తప్పదు. టఫ్ ఫైట్ ఉన్న సమయంలో గెలుపోటములను కొన్ని వందల ఓట్లే నిర్ణయిస్తాయి. పార్టీ చెప్పినట్లు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కారు కొంప మునిగినట్లే. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉండనే ఉంది. పైగా ఖమ్మంలో గతంలో ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్ గెలుపోటములను ప్రభావితం చేయలేదు. ఈసారి చేసే ఛాన్స్ కూడా లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. అయితే కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు సంధిస్తారో తెలియదు. మరి ఎన్నికల సమయానికి ఏమైనా మిరాకిల్ చేసి ఖమ్మంలో గెలుపు దిశగా వెళతారేమో చూడాల్సిందే.