CM KCR: జగన్ కోసం కేసీఆర్.. ఏపీలో కాపు ఓట్లు చీల్చబోతున్నారా.. జగన్‌కు లబ్ధి కలిగించే పక్కా ప్లాన్..?
కమ్మ, కాపు కలిస్తే జనసేన కూటమికి అధికారం పక్కా. అందుకే ఇప్పుడు టీడీపీ-జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు ఓట్లు చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కేసీఆర్ బాధ్యత తీసుకున్నట్లుంది. ఏపీలో కాపు ఓట్లు చీల్చడం ద్వారా లబ్ధి పొందేది వైసీపీనే. తనకు అనుకూలమైన జగన్‌కు లాభం కలిగేలా కేసీఆర్ ప్లాన్ చేశారు.
CM KCR: గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని చాలా మంది అభిప్రాయం. జగన్ గెలవడంలో కేసీఆర్ సాయం ఉందన్న ప్రచారం బాగా జరిగింది. గత ఎన్నికల సంగతి ఏమో కానీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్‌కు సాయం చేసేందుకు కేసీఆర్ ముందుకొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. జనసేనకు, టీడీపీకి అండగా ఉండనున్న కాపు సామాజికవర్గం ఓట్లు చీల్చి, జగన్‌కు లబ్ధి కలిగించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో రాజకీయాలు కులాలమీద ఆధారపడే నడుస్తుంటాయి. రెడ్డి సామాజికవర్గం జగన్‌కు, కమ్మ సామాజికవర్గం టీడీపీకి, కాపు సామాజిక వర్గం జనసేనకు అండగా ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో కాపులు జనసేనకు అండగా ఉండబోతున్నారన్నది ప్రస్తుత ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా ఈ వర్గం ఓట్లు ఈ కూటమికే పడుతాయి. కమ్మ, కాపు కలిస్తే జనసేన కూటమికి అధికారం పక్కా. అందుకే ఇప్పుడు టీడీపీ-జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు ఓట్లు చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కేసీఆర్ బాధ్యత తీసుకున్నట్లుంది. ఏపీలో కాపు ఓట్లు చీల్చడం ద్వారా లబ్ధి పొందేది వైసీపీనే. తనకు అనుకూలమైన జగన్‌కు లాభం కలిగేలా కేసీఆర్ ప్లాన్ చేశారు.
కాపు సంఘాలతో కేసీఆర్ భేటీ
కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌కు ఏపీ బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీకి చెందిన కాపు, ఒంటరి, బలిజ నాయకులను కేసీఆర్ పిలిపించుకున్నారు. ఆదివారం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. సాధారణంగా ఎప్పుడో అవసరమైతే తప్ప ఎవరికీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ కాపు నేతలను పిలిపించుకుని మాట్లాడారంటే దాని వెనుక ఎంతటి పెద్ద ప్లాన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆయా నేతలతో కేసీఆర్ దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయాలతోపాటు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. ఏపీలో జనసేన బలపడుతున్నట్లు తనకే సర్వే రిపోర్టు అందిందని, ఈ సమయంలో ఒంటరిగా పోటీ చేసేలా పవన్ కల్యాణ‌్‌ను ఒప్పించాలని ఆయా నేతలకు కేసీఆర్ సూచించారు. అంటే టీడీపీతో కలవకుండా చూడాలని కూడా ప్రస్తావించారు. ఒంటరిగా పోటీ చేసేలా ఒత్తిడి తేవాలని, ఆయనను ఈ దిశగా ప్రభావితం చేయాలని వారికి ఆదేశించారు. కాపు ఓట్లు జనసేన-టీడీపీకి పడకూడదని, ఓట్లు చీలిపోవాలని ఆయన సూచించారు. జనసేన టీడీపీతో కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తే అంతిమంగా లబ్ధి పొందేది వైసీపీనే. అంటే జగన్ కోసమే కేసీఆర్ మాట్లాడారని ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ కోసమే కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోందన్నారు. అంతేకాదు.. తాను చెప్పినట్లు కాపు ఓట్లు చీలేలా చేసి, వైసీపీ గెలుపునకు సహకరిస్తే ఆ నేతలు అడిగింది చేసేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశానికి తోట చంద్రశేఖర్‌తోపాటు కాపు సామాజికవర్గానికి చెందిన తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతం, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబుతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖులు ఉన్నారు.
అనేక హామీలు
కాపు నాయకులతో భేటీ సందర్భంగా వారికి కేసీఆర్ అనేక హామీలిచ్చినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కులాల భవనాల నిర్మాణం కోసం స్థలం, రూ.10 కోట్ల నగదు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు కూడా కేసీఆర్ పలువురు కాపు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలకు చెందిన కిందిస్థాయి నేతలతో కూడా కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కాపు ఓట్లు చీలిపోవడం, జనసేన-టీడీపీ కలవకూడదు అనే లక్ష్యంతోనే వారితో సమావేశమైనట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరింత మంది నేతలతో కూడా జగన్ తరఫున కేసీఆర్ ఇంతలా పాకులాడటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
పవనే టార్గెటా..?
కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌నే కేసీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఏపీలోనూ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడం, దీనికి జనసేన పార్టీకి చెందిన తోట చంద్రశేఖర్‌ను ఏపీ అధ్యక్షుడిని చేయడం, ఇప్పుడు కాపు నేతలతోనే కేసీఆర్ సమావేశం కావడం.. అన్నీ చూస్తుంటే పవన్ లక్ష్యంగానే కేసీఆర్ పని చేస్తున్నట్లు ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన నేతలనే బీఆర్ఎస్ వైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా ఏపీలో కాపు ఓట్లలో చీలిక తీసుకురావలనేది ఆయన ప్లాన్. ఈ విషయంలో కేసీఆర్ తన వంత ప్రయత్నాలు చేస్తున్నారు.
రివర్స్‌లో జరిగితే ఎలా..?
ఏపీలో కాపుల ఓట్లు ఆ పార్టీకి పడకుండా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు సరే.. మరి తెలంగాణలో వారి ఓట్లు బీఆర్ఎస్‌కు పడకుంటే ఎలా..? ఈ దిశగా జనసేన, టీడీపీ ప్రయత్నాలేమీ చేయడం లేదు. టీడీపీకి కమ్మ ఓటర్లు ఎంత అండగా ఉంటారో తెలిసిందే. తెలంగాణలో ఉన్న ఆ సామాజికవర్గానికి చెందిన ప్రజలు టీడీపీ అంటే ఇప్పటికీ అభిమానం చూపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కాపుల రాజకీయ శక్తిగా మారుతున్న జనసేనకు ఆయా సామాజికవర్గం అండ ఉంది. అటు కమ్మ, ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు తెలంగాణలో లక్షల్లో ఉంటారు. ఏపీలో వారి ఎదుగుదులను అడ్డుకుంటున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో వీళ్లంతా ఏకమైతే కేసీఆర్ పరిస్థితి ఏంటి ఆలోచించారా..? ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడా తమ సామాజికవర్గానికి చెందిన వాళ్లతో, సెటిలర్లతో సమావేశమై కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలి అని ఆదేశిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కేసీఆర్ ఆలోచిస్తే మంచిది. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే.. పవన్, చంద్రబాబు తెలంగాణలో అదే పని చేస్తే నష్టపోయేది కేసీఆరే.