CM KCR: ఆ నాలుగు నియోజకవర్గాలు ఎందుకు ఆపేశారు..? ఎంఐఎం కారణమా..?
అభ్యర్థుల్ని ప్రకటించని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని సరి చేసుకుని త్వరలోనే అభ్యర్థుల్ని వెల్లడిస్తామని కేసీఆర్ అన్నారు. వీటిలో గోషా మహల్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి ఎంఐఎం కారణమని విశ్లేషకులు అంటున్నారు.
CM KCR: తెలంగాణలోని 119 నియోజకవర్గాలకుగాను 115 స్థానాలకు అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించారు. నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని పెండింగులో పెట్టారు. అవి నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్. ఇంతకీ.. ఈ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించకపో్వడానికిగల కారణాలేంటి..?
అభ్యర్థుల్ని ప్రకటించని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని సరి చేసుకుని త్వరలోనే అభ్యర్థుల్ని వెల్లడిస్తామని కేసీఆర్ అన్నారు. వీటిలో గోషా మహల్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి ఎంఐఎం కారణమని విశ్లేషకులు అంటున్నారు. గోషా మహల్ నుంచి ప్రస్తుతం బీజేపీ తరఫున రాజా సింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. త్వరలో ఈ సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్ ఉంది. దీంతో తిరిగి రాజా సింగ్ బీజేపీ నుంచే పోటీ చేస్తారు. ఈ విషయాన్ని రాజా సింగ్ కూడా చెప్పారు. గోషా మహల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయబోయేది తానేనని, మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పాడు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణం ఎంఐఎం అని రాజా సింగ్ ఆరోపించారు.
గోషా మహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని నిర్ణయించేది కేసీఆర్ కాదని.. ఎంఐఎం అన్నారు. అలాగే నాంపల్లి నుంచి ప్రస్తుతం ఎంఐఎం తరఫున జాఫర్ హుస్సేన్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, సోమవారం కేసీఆర్ మాట్లాడుతూ.. తమకు ఎంఐఎంతో స్నేహపూర్వక ఒప్పందం ఉందన్నారు. ఇక నాంపల్లి, గోషా మహల్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీకి మంచి పట్టుంది. ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ. గెలుపోటములను ప్రభావితం చేయగలరు. అందులోనూ.. నాంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఐఎంనే. అందువల్ల బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఐంఐఎం అనుమతి తప్పకుండా అవసరం. అలాగే గోషా మహల్ స్థానంలోనూ అదే జరుగుతుంది. ఇప్పుడప్పుడే ఎంఐఎం తరఫున అభ్యర్థుల ప్రకటన కూడా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ రెండు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, నాంపల్లికి సంబంధించి సరైన అభ్యర్థి దొరకలేదనే ప్రచారం కూడా ఉంది.
జనగాం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయనపై సొంత కూతురే భూకబ్జా ఆరోపణలు చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. పల్లా, ముత్తిరెడ్డి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిక్కెట్ విషయంలో నేతలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపు వాయిదా వేశారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విషయంలో వివాదం నడుస్తోంది. సునీత బీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరువురి మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో సీటు కేటాయింపు వాయిదా పడింది. వీటన్నింటి విషయంలో ఒక స్పష్టత వస్తే వెంటనే అభ్యర్థుల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆలస్యం చేయాలని కేసీఆర్ అనుకోవడం లేదు. ముందుగా సీట్లు కేటాయిస్తే.. నియోజకవర్గంలో పని చేసేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు.