CM kcr: బీజేపీ, కాంగ్రెస్.. కేసీఆర్ పయనం ఎటు.. ముందున్న ఆప్షన్లేంటి.. వ్యూహం మార్చాల్సిందేనా?
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. ఢిల్లీలో బీజేపీని గద్దెదించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. కలిసి ఉన్నది ఎవరు.. కలిసి వచ్చేది ఎవరు అన్న లెక్కలు పక్కనపెడితే.. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో ఇప్పటికీ కన్ఫ్యూజింగ్‌గానే ఉంది చాలామందికి ! జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టి.. ఢిల్లీపై దండయాత్ర చేసి కమలం పార్టీని దెబ్బతీయాలన్నది కేసీఆర్ వ్యూహం.
ఐతే అది అంత ఈజీ కాదు. బీజేపీని ఓడించాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్ శత్రువుకి శత్రువుని మిత్రుడిలా చేసుకుంటున్నాడా అంటే.. ఆ పార్టీతోనూ దూరంగానే కనిపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తో సమదూరంలో కనిపిస్తోంది బీఆర్ఎస్. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలన్న విషయం.. కేసీఆర్ చేయి దాటిపోయిందన్నది మాత్రం క్లియర్. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలేవీ కేసీఆర్‌ను పట్టించుకోవడం లేదు. అంతెందుకు ముందు నుంచి తోడుగా నడిచిన జేడీఎస్ కూడా నెల తిరగకముందే.. తన దారి తాను చూసుకుంది.
ఇలా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు మధ్యలో.. సమాన దూరంలో మిగిలిపోయారు కేసీఆర్. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. అది ఒక్క రాష్ట్రంలో ఫలితమే అయినా.. కర్ణాటక గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. అమిత్ షా, మోదీ… ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇద్దరు కలిసి భారీ ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాల ఆలోచన మారిపోయింది. థర్డ్ ఫ్రంట్ అంటూ పట్టిన పట్టు వీడనట్లు కనిపించిన దీదీలాంటి వాళ్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు అంటున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్‌కే జై అంటున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ తన స్ట్రాటజీ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే అటు.. లేకపోతే ఇటు.. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరంలో ఉన్న కేసీఆర్.. తన ఆశయం అంతో ఇంతో నెరవేరాలంటే.. ఏదో ఒక నిర్ణయం కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒక్కటి మాత్రం క్లియర్.. బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ అధికారం కావాలని కోరుకోవడం కేసీఆర్ అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే మెజారిటీ సీట్లలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ కాబట్టి ! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తన కలలు నెరవేరాలంటే.. కాంగ్రెస్‌కు జై కొట్టాల్సిందే. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయ్ కదా అనుకుంటే.. ఎలక్షన్స్ అయ్యే వరకు ఆగి అప్పుడైనా హ్యాండ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడమే ఇప్పుడు ముందున్న ఆప్షన్.