BRS: నేడో.. రేపో.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. 112 స్థానాలకు అభ్యర్థుల ఖరారు..!

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఏకంగా 112 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేసీఆర్ ఖరారు చేశారు. కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చబోతున్నారు. ఒక ఎమ్మెల్సీ, ఒక జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 04:33 PMLast Updated on: Aug 18, 2023 | 4:33 PM

Cm Kcr Prepared First List Of Brs Mla Candidates Will Announce On Saturday

BRS: ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. తెలంగాణలోని ఇతర పార్టీలకంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత లేదా శనివారం (ఆగష్టు 19) బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఏకంగా 112 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని కేసీఆర్ ఖరారు చేశారు. కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చబోతున్నారు.

ఒక ఎమ్మెల్సీ, ఒక జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వబోతున్నారు. ఉమ్మడి మెదక్‌లో ఒక స్థానం, ఆదిలాబాద్‌లో రెండు స్థానాల్లో, ఉమ్మడి వరంగల్‌లో ఒక స్థానం, ఉమ్మడి కరీంనగర్‌లో ఒకటి, ఉమ్మడి రంగారెడ్డిలో ఒక స్థానంలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తవారికి సీట్లు దక్కబోతున్నాయి. ఈ జాబితాలో 95 శాతం సిట్టింగులకే అవకాశం దక్కబోతుంది. సీట్లు దక్కని ముఖ్య నాయకులను ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా.. వాటిలో మొదటి జాబితాలోనే 112 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ఎన్నికలకు ఇంకా కనీసం మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇంత ముందుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వెల్లడించడం విశేషం.

అభ్యర్థుల్ని ముందుగా ఖరారు చేయడం ద్వారా ఎన్నికలకు ప్రతిపక్షాలకంటే ఎక్కువ సిద్ధంగా ఉన్నామనే సంకేతాల్ని కేసీఆర్ పంపుతున్నారు. ఇది కచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు ఒక హెచ్చరికలాంటిదే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు కమ్యూనిస్టులకు కూడా కేసీఆర్ సీట్లు కేటాయించినట్లు సమాచారం. సీపీఐ, సీపీఎం.. చెరో రెండు సీట్లు కావాలని కోరినప్పటికీ.. ఒక్కో స్థానాన్ని కేసీఆర్ కేటాయించారు. సీపీఎంకు మునుగోడు సీటు, సీపీఐకి భద్రాచలం సీటును కేసీఆర్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత సీపీఎం, సీపీఐలకు చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు.