CM KCR: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. జాబితా సిద్ధం చేసిన కేసీఆర్..?

మూడోసారి అధికారం చేపట్టి, హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. సర్వేలు, పనితీరు ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వబోతున్నారు. అవసరమైతే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టబోతున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 25, 2023 | 11:50 AMLast Updated on: Jul 25, 2023 | 11:50 AM

Cm Kcr Ready To Announce First List Of Mla Candidates Of Brs

CM KCR: మరో నాలుగు నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ లోపు ఎన్నికలకు సిద్ధం కావాలంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలి. ఈ విషయంలో అందరికంటే ముందుండబోతుంది బీఆర్ఎస్. త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆగష్టు మూడో వారంలో మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే జాబితా ప్రకటించాల్సి ఉన్నా.. అధిక మాసం కారణంగా వాయిదా పడింది. నిజశ్రావణ మాసంలో అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. ముహూర్తాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు ఈ సమయాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.
మూడోసారి అధికారం చేపట్టి, హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈసారి పరిస్థితులు పూర్తి అనుకూలంగా లేనందున అభ్యర్థుల ఎంపికను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్వేలు, పనితీరు ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వబోతున్నారు. అవసరమైతే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టబోతున్నారు. నియోజకవర్గంలో ఆదరణ లేని వారిని, విమర్శలు, వ్యతిరేకత ఉన్న వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేదు. సిట్టింగుల్లో కొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి వారిని పక్కనబెట్టబోతున్నారు. ప్రజాదరణ ఉండి, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల విపరీతమైన పోటీ నెలకొంది. అటువంటి స్థానాలకు మొదటి విడతలో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం లేదు.

అలాగే టిక్కెట్లు ఇవ్వని సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లోని అభ్యర్థుల్ని కూడా ఈసారి ప్రకటించడం లేదు. ఈ స్థానాలకు ఎన్నికల ముందు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ముందుగానే ప్రకటిస్తే, టిక్కెట్ రానివాళ్లు తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి స్థానాలు మినహా వివాదాలకు తావులేని, గెలిచే అవకాశాలున్న చోట అభ్యర్థుల ప్రకటన ఆగష్టులోనే ఉంటుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటికి రెండు విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు కేసీఆర్. ముందుగా ప్రకటించిన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, ఎక్కడైనా తిరుగుబాట్లు వచ్చినా ఎన్నికలలోపు సర్దుబాటు చేయొచ్చని కేసీఆర్ ఆలోచన. త్వరలోనే మొదటి జాబితా వెలువడుతుండటంతో ఆశావహులు, సిట్టింగుల్లో ఆందోళన మొదలైంది.

తమకు బీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందా.. రాదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టిక్కెట్ రాకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అనుగుణంగా ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. కారణం.. అక్కడ టిక్కెట్ రాని వాళ్లను, అసంతృప్తులను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆశించడమే. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి.