CM KCR: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సైలెన్స్.. బీజేపీకి మద్దతిస్తున్నారా? వ్యూహమా..?
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్.. జాతీయ పార్టీ. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. అలాంటిది ఇప్పుడు జాతీయ అంశాలపై స్పందించడమే మానేశారు. జాతీయ పార్టీ అంటే పేరు మారిస్తే సరిపోతుంది అనుకున్నారేమో కేసీఆర్.
CM KCR: జాతీయ రాజకీయాల్లో అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై, కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్ ఇటీవలి కాలంలో మౌనంగా ఉంటున్నారు. జాతీయ అంశాల్లో ఆయన వైఖరి ఏంటో తెలియడం లేదు. కీలకమైన రూ.2 వేల నోట్ల రద్దుపై స్పందించలేదు. మరోవైపు మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష సీఎంలు సమావేశం అవుతుంటే.. దానికి కేసీఆర్ హాజరవుతారా అనేది సందేహమే. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మాట్లాడ్డమే మానేశారు.
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్.. జాతీయ పార్టీ. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. దేశవ్యాప్తంగా పోటీ చేస్తానని చెప్పారు. కానీ, ఇప్పటివరకు మహారాష్ట్రలోని ఒకట్రెండు చోట్ల పంచాయతీకి మాత్రమే పోటీ చేశారు. కర్ణాటక ఎన్నికల్ని గాలికొదిలేశారు. అంతకుముందు సందర్భం దొరికినప్పుడల్లా దేశ జీడీపీ గురించి, ద్రవ్యోల్బణం గురించి, వ్యవసాయం, విద్యుత్, జల వనరులు.. ఇలా ఏవేవో అంశాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. దేశాన్నే మారుస్తామన్నారు. అలాంటిది ఇప్పుడు జాతీయ అంశాలపై స్పందించడమే మానేశారు. జాతీయ పార్టీ అంటే పేరు మారిస్తే సరిపోతుంది అనుకున్నారేమో కేసీఆర్.
ఈ అంశాలపై మాట్లాడరా?
గతంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు సమయంలో ప్రధాని నిర్ణయాన్ని కేసీఆర్ సమర్ధించారు. అయితే, ఇప్పుడు రూ.2,000 నోట్ల రద్దు విషయంలో కేసీఆర్ తన వైఖరేంటో చెప్పడం లేదు. అనేక పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. కానీ కేసీఆర్, బీఆర్ఎస్ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న జరగనుంది. మోదీ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం, టీఎంసీ వంటి పార్టీలు స్పందించాయి. రాష్ట్రపతిని పిలవకపోవడం అన్యాయం అని, రాష్ట్రపతితోనే భవనం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కూడా చెప్పాయి. అందులో కేసీఆర్ మిత్రపక్షాలైన ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, దీనిపై కూడా కేసీఆర్ అండ్ కో స్పందించలేదు. ఢిల్లీలో ప్రభుత్వంపై పట్టు కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీతోపాటు కాంగ్రెస్, మిత్రపక్షాలు ఖండించాయి. ఈ అంశంపైనా కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. పైగా కేసీఆర్‌కు కేజ్రీవాల్ మంచి మిత్రుడు కూడా. తన మిత్రుడి కోసం కేసీఆర్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇలాంటి అనేక అంశాల్లో ప్రతిపక్షాలు బీజేపీ, మోదీపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం కనీసం స్పందించడం లేదు.
బీజేపీకి మద్దతిస్తోందా?
కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీజేపీకి ఆ పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీవైపు వెళ్లేందుకు కేసీఆర్ ఆసక్తి చూపిస్తుండొచ్చనే వాదన మొదలైంది. అయితే, కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు అన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకే కేసీఆర్ ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారా అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన అవసరాన్ని బట్టి ఏ పార్టీకి మద్దతివ్వాలో కేసీఆర్ నిర్ణయించుకునే అవకాశం ఉంది. అందుకే గతంలోలాగా బీజేపీని విమర్శించడం లేదు. కాంగ్రెస్ విషయంలో కూడా తీవ్రంగా విమర్శలు చేయడం లేదు. అయితే, ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడ బీజేపీని విమర్శించకుండా, కాంగ్రెస్ పార్టీనే విమర్శించడం విశేషం.
కేసీఆర్‌కు షాకిచ్చిన మిత్ర పక్షాలు
కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలకు ఊతమిచ్చిన ఇతర పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వంటి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టీఎంసీ కూడా ఆ పార్టీకే మద్దతిస్తోంది. తమిళనాడులో డీఎంకే ఎలాగూ ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తోంది. కేరళలో కమ్యూనిస్టు పార్టీ, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ కూడా కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నాయి. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం. దీంతో కేసీఆర్‌తో కలిసొచ్చే పార్టీలంటూ ఏవీ లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఒంటరైనట్లు కనిపిస్తోంది. దీంతో తనకేం చేయాలో తోచక కేసీఆర్ మౌనంగా ఉంటున్నట్లు భావించాలి.
వ్యూహమేనా?
రాజకీయాల్లో కేసీఆర్ ఎత్తుగడల్ని అంచనావేయడం కష్టం. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించే కేసీఆర్ తర్వాత ఒక్కసారిగా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రతిపక్షాల్ని దెబ్బతీస్తుంటారు. అంతవరకు వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తుంటారు. ప్రస్తుతం కేసీఆర్ పాటిస్తున్న మౌనం కూడా అలాంటిదేనా అని మరో సందేహం వ్యక్తమవుతోంది. జాతీయ పార్టీ అంటూ పెట్టుకున్నాక ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయాలపై స్పందించాలి. అది చేయలేనప్పుడు జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం.. దేశాన్ని మార్చేస్తాం.. ఏదో రాజకీయాలు చేద్దాం అంటే కుదరదు. లేదా జాతీయ రాజకీయాలతో మాకేం సంబందం లేదు. మా ప్రాంతం.. మా రాష్ట్రం మాకు ముఖ్యం.. మాది ప్రాంతీయ పార్టీ అనుకుంటూ రాజకీయం చేయాలి.