Mynampally Hanumanth Rao: మైనంపల్లి మీద పోటీకి మహిళా అభ్యర్థి..!
మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మైనంపల్లిని బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన రాజీనామాతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయ్యింది. మైనంపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
Mynampally Hanumanth Rao: కొన్ని రోజుల నుంచి బీఆర్‌ఎస్ మీద ధిక్కార స్వరం వినిపిస్తున్న మైనంపల్లి హనుమంతరావు రీసెంట్‌గానే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు మల్కాజ్‌గిరితో పాటు తన కొడుకు రోహిత్‌కు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి మైనంపల్లి భంగపడ్డారు. రెండు టికెట్లు ఇవ్వని కారణంగానే ఆయన పార్టీ వీడారు. త్వరలోనే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని ఆయన అనుచరుల్లో టాక్ నడుస్తోంది.
మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మైనంపల్లిని బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన రాజీనామాతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయ్యింది. మైనంపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో చర్చలు కూడా ప్రారంభించింది. మల్కాజ్‌గిరి ఇంచార్జ్‌గా కేటీఆర్, మెదక్ ఇంచార్జ్‌గా హరీష్ రావును నియమించి.. ఆ రెండు స్థానాల్లో మైనంపల్లిని, ఆయన కొడుకును ఓడించడమే టార్గెట్‌గా బీఆర్‌ఎస్ పని చేస్తున్నట్టు టాక్. జనగాం, స్టేషన్ ఘన్‌పూర్‌లో నెలకొన్న వివాదాలకు రీసెంట్‌గానే చెక్ పెట్టిన బీఆర్‌ఎస్ అధిష్టానం.. జనగామ అభ్యర్థితో పాటు మల్కాజ్‌గిరి అభ్యర్థిని కూడా రెండు మూడు రోజుల్లో ప్రకటించే చాన్స్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే మల్కాజ్‌గిరిలో మైనంపల్లిని ఢీ కొట్టే మహిళా క్యాండెట్ ఎవరా అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఒకవేళ మహిళా అభ్యర్థి దొరక్కపోతే ఓ బీసీ నేతను పోటీలో దింపేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. అవసరమైతే వార్డుకు ఒక ఇంచార్జ్‌ను నియమించి మల్కాజ్‌గిరి, మెదక్ స్థానాలను గెలిచి తీరాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారట. దీంతో ఇప్పుడు మైనంపల్లికి పోటీగా బీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగే అభ్యర్థి ఎవరా అనేది సస్పెన్స్‌గా మారింది.