CM KCR: బహిరంగ సభలు సక్సెస్.. జోష్‌లో బీఆర్ఎస్.. ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తప్పదా..?

ఈ నెలలోనే కేసీఆర్ నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నెల 4న నిర్మల్‌లో, ఆ తర్వాత నాగర్ కర్నూల్‌లో, అనంతరం మంచిర్యాలలో, చివరగా గద్వాల్‌లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలన్నీ సక్సెస్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 13, 2023 | 03:18 PMLast Updated on: Jun 13, 2023 | 3:18 PM

Cm Kcrs Public Meetings Are Huge Success Brs In Josh

CM KCR: గతంతో పోలిస్తే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఊపు తగ్గింది. అయితే, ఇప్పుడు కేసీఆర్ మళ్లీ పార్టీలో జోష్ నింపారు. తొమ్మిది రోజుల్లో నాలుగు బహిరంగ సభలు నిర్వహించి, అవి సక్సెస్ అయ్యేలా చేశారు. దీంతో పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ నెలలోనే కేసీఆర్ నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నెల 4న నిర్మల్‌లో, ఆ తర్వాత నాగర్ కర్నూల్‌లో, అనంతరం మంచిర్యాలలో, చివరగా గద్వాల్‌లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలన్నీ సక్సెస్ అయ్యాయి. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సభలకు భారీగా జనం పోటెత్తడంతో ప్రజలు ఇంకా తమవైపే ఉన్నారని స్పష్టమవుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
కేసీఆర్ రాజకీయం అంతే..
ఇది ఎన్నికల సమయం. అధికార పార్టీయే అయినప్పటికీ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా అవసరం. అందుకే అన్ని పార్టీలు ఏదో ఒక పేరుతో.. ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా ప్రగతి నివేదన, కలెక్టరేట్ భవనాల ప్రారంభం అంటూ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి చోటా బహిరంగ సభలు నిర్వహించింది. ఇదంతా మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ వేసిన ప్లాన్. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో కేసీఆర్‪కు బాగా తెలుసు. అందుకే సభలు పెట్టి.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు చెప్పారు. అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ధరణి విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు.
పార్టీకి కలిసొస్తుందా..?
వరుసగా బీఆర్ఎస్ నిర్వహించిన సభలు సక్సెస్ కావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలలే సమయం ఉండటం వల్ల పార్టీకి జోష్ తేవాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది. ఈ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడం కూడా శుభసంకేతంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్‌కు ఆదరణ తగ్గుతోంది.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బలపడుతున్నాయి.. జనాల్లోనూ బీఆర్ఎస్‌పై ఆగ్రహం పెరిగింది అంటూ జరుగుతున్న ప్రచారానికి ఈ సభల ద్వారా కేసీఆర్ చెక్ పెట్టేశారు. తమకు ఇంకా ఆదరణ తగ్గలేదని మరోసారి కేసీఆర్ నిరూపించారు. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందని నేతలు ఆశిస్తున్నారు.