CM REVANTH REDDY: మహాలక్ష్మి పథకం ప్రారంభం.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ 'అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని సీఎం రేవంత్ శనివారం ప్రారంభించారు. అలాగే తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'మహాలక్ష్మి' పథకాన్ని కూడా ప్రారంభించారు.
CM REVANTH REDDY: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శనివారం నుంచి రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ ‘అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకాన్ని సీఎం రేవంత్ శనివారం ప్రారంభించారు. అలాగే తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా మంత్రులు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. “ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తాం. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీల అమలులో భాగంగా శనివారం నుంచి 2 పథకాలు అమలవుతున్నాయి.
వారం రోజులపాటు మహిళలు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారం తర్వాత నుంచి ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కూడా చూపించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ మహిళలకు మాత్రమే ఉద్దేశించిన పథకం. ఇతర రాష్ట్రాల వారికి ఈ పథకం వర్తించదు. తెలంగాణలో తిరిగే బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే బస్సు టిక్కెట్ తీసుకోవాలి. త్వరలో ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకునేందుకు స్మార్ట్ కార్డులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం ఆరంభం కావడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.