Bandla Ganesh: మళ్లీ కాంగ్రెస్‌లోకి బండ్ల గణేష్‌.. ఈసారి ఏం రచ్చ చేయబోతున్నారో..

బండ్ల గణేష్.. పరిచయం అవసరం లేని పేరు. ఫుల్‌ జోష్‌లో ఎప్పుడూ దూకుడు మీద కనిపించే మనిషి. సినిమాలు, రాజకీయాలు తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 25, 2023 | 12:48 PMLast Updated on: Jun 25, 2023 | 12:48 PM

Comedian And Film Producer Bandla Ganesh Has Announced Through His Tweet That He Is Ready To Join The Telangana Congress Party

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బండ్ల.. ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తాడో అంచనా వేయడం అంత ఈజీ కాదు. నటుడిగా, నిర్మాతగా చాలా సినిమాల్లో కనిపించిన బండ్ల.. కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ మధ్య త్రివిక్రమ్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ.. పవన్ కల్యాణ్‌తో అనుబంధాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసిన బండ్ల.. ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. గతంలో కాంగ్రెస్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల గణేష్.. 2018 ఎన్నికల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగానూ బరిలోకి దిగుతారని అంతా అనుకున్నా.. చివరికి ప్రచారానికే పరిమితం అయ్యారు బండ్ల.

కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటా బ్లేడ్ రెడీగా పెట్టుకోండి అంటూ బిల్డప్ ఇచ్చిన బండ్ల.. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు యూటర్న్ తీసుకున్నారు. త్వరలో రాజకీయ జీవితంపై క్లారిటీ ఇస్తానని ప్రకటనలు చేశారు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా.. కాంగ్రెస్‌లో మళ్లీ చేరరేమో.. బండ్ల దేవుడిలా చూసే పవన్ కల్యాణ్ జనసేనలోకి ఎంట్రీ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు. ఐతే అంచనాలకు అందితే అతను బండ్ల ఎందుకు అవుతాడు మరి ! మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్‌ చేశాడు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన.. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు సూర్యాపేట వెళ్తున్నానని బండ్ల ట్వీట్ చేసాడు. అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చేయేస్తా.. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు బండ్ల. ఆయన పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ఈమ ధ్యే మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని బండ్ల గణేష్ కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో మళ్లీ యాక్టివ్ అయ్యి.. ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మరి ఈసారి అయినా అందరి అంచనాలు నిజం చేస్తారా.. ఎప్పటిలానే తన దారి ఎవరికీ అర్థం కాని దారి అనిపిస్తారా చూడాలి మరి.