వచ్చేస్తోంది..సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమ్మీదకు
9 నెలల నిరీక్షణ ఫలించింది. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాకకు...కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. స్పేస్ ఎక్స్ ఆపరేషన్ సక్సెస్ అయింది.

9 నెలల నిరీక్షణ ఫలించింది. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాకకు…కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. స్పేస్ ఎక్స్ ఆపరేషన్ సక్సెస్ అయింది. రేపు సాయంత్రం 6గంటలకు భూమ్మీద అడుగు పెట్టనున్నారు. వ్యోమగాముల రాకకోసం…కోట్ల మంది జనం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ అప్పగించిన పనిని…స్పేస్ ఎక్స్ దిగ్విజయంగా పూర్తి చేస్తోంది.
9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోరో…మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్నారు. స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు…ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు.
అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్‌లు ఉన్నారు. వీరందరూ ఆదివారం ఐఎస్‌ఎస్‌కు చేరుకొన్నారు.
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం…ఇవాళ రాత్రి 10.45 గంటలకు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. ఈ స్పేస్‌షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. అదే రోజు సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో వారు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో…వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో 9నెలలుగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ చిక్కుకుపోయారు. అప్పటి నుంచి కిందికి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత…వారిని భూమ్మీదకు తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు అప్పగించారు. తాజాగా స్పేస్ ఎక్స్ పంపిన క్రూ-10 మిషన్ విజయవంతంగా నాసాతో అనుసంధానం కావడంతో…సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ కు విముక్తి లభిస్తోంది.