TELANGANA ELECTIONS: అభ్యర్థుల ఎంపికపై ఇంకా తేల్చని కాంగ్రెస్, బీజేపీ.. సా..గదీత కొంప ముంచుతుందా..?
అభ్యర్థుల్ని ఎంత తొందరగా నిర్ణయిస్తే.. వాళ్లు అంత త్వరగా ప్రజల్లోకి వెళ్లి పని చేసుకుంటారు. తమకు ఓటేయాలి అని ప్రజల్ని అభ్యర్థిస్తారు. విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించడంతో వాళ్లంతా ఎప్పుడో ప్రచారంలోకి దిగిపోయారు. ప్రజల్లో ఉంటున్నారు.

TELANGANA ELECTIONS: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇక పార్టీలన్నీ పూర్తిస్థాయిలో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ చాలా ముందుంది. దాదాపు నెల రోజుల క్రితమే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఐదారుగురు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు కేటాయించింది. పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలున్నా.. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం ఆ పార్టీకి కచ్చితంగా మేలు చేసేదే. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రం వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఇది ఆ పార్టీల గెలుపు అవకాశాల్ని దెబ్బతీస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థుల్ని ఎంత తొందరగా నిర్ణయిస్తే.. వాళ్లు అంత త్వరగా ప్రజల్లోకి వెళ్లి పని చేసుకుంటారు. తమకు ఓటేయాలి అని ప్రజల్ని అభ్యర్థిస్తారు. విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించడంతో వాళ్లంతా ఎప్పుడో ప్రచారంలోకి దిగిపోయారు. ప్రజల్లో ఉంటున్నారు. నియోజకవర్గం అంతా పర్యటిస్తూ, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇది వారికి సానుకూలంగా మారుతోంది. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రం నేతలంతా.. తమకు టిక్కెట్ వస్తుందా.. రాదా.. అనే సంశయంలోనే ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనే ఆలస్యమైతే.. వాళ్లెప్పుడు ప్రజల్లోకి వెళ్తారు..? ప్రచారం చేసుకుంటారు..? ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంపై రాజకీయనేతల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు, వ్యూహాలు చాలా అవసరం. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలు పార్టీకి మేలు చేయకపోవచ్చు. చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు కొన్నిసార్లు ఓటమిని నిర్దేశిస్తుంది. అలాంటప్పుడు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే మంచిది. నేతలు తమ వ్యూహాలు రచిస్తారు. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం, సొంత పార్టీ అసంతృప్తుల్ని బుజ్జగించడం వంటివి చేసుకుంటారు. ఈ అవకాశం లేకుండా చేసుకుంటున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ రెండు పార్టీలు.. అభ్యర్థుల ప్రకటనకు మరో వారం, రెండు వారాల సమయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 50 శాతం మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయా అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చింది. దీంతో వారు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మిగిలిన 50 శాతం అభ్యర్థల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. బీజేపీ కూడా ఇదే పనిలో ఉంది. మరి కొద్ది రోజుల్లోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. కానీ, ఆలోపే ఇతర పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తారు. ఈ ఆలస్యం వారి కొంప ముంచుతుందా అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.