Congress BC Declaration: బీసీలకు పెద్దపీట.. అధిక సీట్లతో ఆకర్షించే యత్నం.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..!
తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీసీలకు అధిక సీట్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బీసీ డిక్లరేషన్ రూపొందిస్తోంది. దీనిపై పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఆసక్తితో ఉన్నారు.
Congress BC Declaration: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అన్ని అవకాశాల్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది. దీని ద్వారా అధికార బీఆర్ఎస్‌తోపాటు, బీజేపీకి కూడా సవాల్ విసిరినట్లవుతుంది. ప్రత్యర్థి పార్టీల్ని చిత్తు చేసేందుకు ఈ వ్యూహం బాగా పని చేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ పద్ధతిని కర్ణాటకలో అమలు చేయడం వల్ల అక్కడ విజయం సాధించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. దీంతో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీసీలకు అధిక సీట్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బీసీ డిక్లరేషన్ రూపొందిస్తోంది. దీనిపై పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఆసక్తితో ఉన్నారు. తన అనుమతి తీసుకుని, దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. ఆదివారం జరిగే సభలో లేదా త్వరలోనే బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.
జనరల్ స్థానాల్లోనూ సీట్లు
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 30 రిజర్వ్‌డ్ (ఎస్సీ, ఎస్టీ) స్థానాలున్నాయి. మిగతాస్థానాలు జనరల్ సీట్లే. వీటిలోనే అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. బీసీలకు సీట్లు కేటాయిస్తున్నప్పటికీ అక్కడి అగ్రవర్ణాల వారిని పోటీకి దూరంగా ఉంచకుండా, బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకుని సమన్యాయం చేయాలనుకుంటోంది. బీసీలను ఎన్నికల్లో పోటీకి దించడం ద్వారా ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీలకు అధిక సీట్లు ఇచ్చే అంశంపై త్వరలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. బీసీ డిక్లరేషన్ ముసాయిదా ఖరారైన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.
బీఆర్ఎస్, బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రవర్ణాలకు చెందిన నేతలపై బీసీలను రంగంలోకి దింపి, వారి ఆధిపత్యానికి చెక్ పెట్టాలనుకుంటోంది. అగ్రవర్ణాలు మంత్రులుగా, కీలక పదవుల్లో ఉన్న చోట ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇస్తామని హామీ కూడా కాంగ్రెస్ ఇవ్వబోతుంది. నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి చేరవవుతామని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతో బీసీ ఓట్లను అత్యధికంగా కాంగ్రెస్ కొల్లగొట్టేందుకు ప్లాన్ వేసింది.