Rahul Gandhi: తెలంగాణపై రాహుల్ స్పెషల్ ఫోకస్.. కాంగ్రెస్‌కు అంత ధీమా ఏంటి ?
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే కనిపిస్తున్నాయ్. నిన్న కర్ణాటకలో విజయం.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న జోష్.. హస్తం పార్టీ దూకుడు మంత్రం పఠించేలా చేస్తోంది. దీనికితోడు సర్వేలు కూడా అనుకూలంగా వినిపిస్తున్నాయ్. తెలంగాణ కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయనే సర్వే నివేదికలతో.. ఆ పార్టీ అధిష్టానం అప్రమత్తం అయింది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణాలపై ఓ క్లారిటీకి వచ్చింది. గ్రూప్ రాజకీయాలే.. తెలంగాణలో పార్టీ విజయావకాశాలు దెబ్బ తీస్తున్నాయని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. గాంధీ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చింది. నిజానికి ఈ విషయం ఎప్పడు గ్రహించినా.. కొంపలో కుంపట్లను ఆర్పేందుకు చేసే ప్రతీ ప్రయత్నం విఫలం అయింది. పార్టీ ఇంచార్జిని మార్చినా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఐతే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జనాల్లో హస్తం పార్టీకి ఆదరణ పెరగడం.. బీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ ఎదగడంతో.. ఇప్పుడు ఇప్పుడు మళ్లీ పార్టీ మీద ఫోకస్ పెంచింది అధిష్టానం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రేంజ్‌లో పార్టీలో లుకలుకలకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. ఇద్దరిపై వేటు వేస్తే పార్టీ అంతా సెట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారంటే.. తెలంగాణ మీద ఆయన ఎలాంటి ఫోకస్ పెట్టారో అర్థం అవుతోంది.
ఇక తెలంగాణలో పార్టీకి సంబంధించి ప్రతీ అంశాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని మరీ చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. చేరికల దగ్గర నుంచి సీట్ల కేటాయింపుల వరకు ప్రతీ విషయంలో తనదే ఫైనల్ నిర్ణయం అన్నట్లుగా పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఎవరు నోరు జారినా.. గీత దాటినా చూస్తూ ఊరుకునేది లేదు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు పొలిటికల్ ఎనలిస్టుగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు ద్వారా.. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు రాహుల్.
కర్ణాటక మంత్రాన్ని ఇక్కడ కూడా జపిస్తున్నారు. హామీలు మాత్రమే కాదు.. కలిసి పనిచేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందో కర్ణాటకలో తెలిసి వచ్చింది. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లయ్ చేయబోతున్నారు. అందుకే పార్టీ నేతలందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు రాహుల్. పార్టీలో రాజకీయలకు చెక్ పెడితే.. రాజకీయాన్ని శాసించడం పెద్ద మ్యాటర్ కాదు అని అనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైందని.. కాస్త జాగ్రత్తగా ఉంటే.. అధికారం పెద్ద మ్యాటర్ కాదని రాహుల్ ధీమాతో కనిపిస్తున్నారు. దీనికోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది గాంధీభవన్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.