Top story: హరిత హారం వెనుక హరిత విధ్వంసం, బీఆర్ఎస్ చరిత్ర లాగుతున్న కాంగ్రెస్
హెచ్సియూ భూముల్లో అడవుల విధ్వంసం జరుగుతోందని, వన్య ప్రాణులను నిలువునా చంపేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కన్నీళ్లు కారుస్తున్నారు.

హెచ్సియూ భూముల్లో అడవుల విధ్వంసం జరుగుతోందని, వన్య ప్రాణులను నిలువునా చంపేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ విషయంలో ముందు కాంగ్రెస్ కాస్త వెనుకబడినా.. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో జరిగిన విధ్వంశాలను బయటకు లాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నియోపోలిస్ వరకు హరిత హారం నుంచి కాంక్రీట్ జంగిల్ వరకు గులాబీ పార్టీ పాలనలో జరిగిన కృత్రిమ ప్రకృతి విపత్తు అంటూ కౌంటర్ లు ఇవ్వడం మొదలుపెట్టింది.
2014 మరియు 2023 మధ్య లక్షలాది చెట్లను నరికివేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉంది గులాబి పార్టీ అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. హరిత హారం పేరుతో అడవులను పెంచాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ, తెలంగాణలో లక్షలాది చెట్లను నాశనం చేసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2015 నుండి 2022 వరకు, కేసీఆర్ సర్కార్ హరితహారం కార్యక్రమం కింద 219 కోట్ల మొక్కలు నాటినట్లు పేర్కొంది, దీని కోసం 9,777 కోట్లు ఖర్చు చేసారు.
ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించారు. నాటిన మొక్కలు 85% బతికాయని కేసీఆర్ అప్పట్లో వ్యాఖ్యానించారు. మరి అదే నిజమైతే, తెలంగాణ అటవీ విస్తీర్ణం 21,591 చ.కి.మీ 2014కు నుంచి 2021 నాటికి 21,213 చ.కి.మీకి ఎందుకు తగ్గిపోయింది? అంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది. 2014 మరియు 2024 మధ్య, బీఆర్ఎస్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమి అధికారికంగా.. అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించింది అప్పటి ప్రభుత్వం.
అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలోనే 12,12,753 చెట్లను నరికినట్టు కాంగ్రెస్ సాక్ష్యాలతో సహా బయటపెడుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు చేయగా.. ఇప్పుడు అది ఏ ఉపయోగం లేకుండా ఆగిపోయింది. ఇక ఇందుకోసం 8,000 ఎకరాల్లో అడవిని నరికేశారు. 2016-2019 మధ్య కాలంలో మొత్తం 12 లక్షలకు పైగా చెట్లను గులాబి పార్టీ హయాంలో నరికినట్టు కాంగ్రెస్ మండిపడుతోంది. అప్పుడు లేని పర్యావరణ ప్రేమ, అప్పుడు లేని అడవి జంతువులపై ప్రేమ ఇప్పుడు ఎందుకు అంటూ నిలదీస్తోంది.
అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం సైతం ధృవీకరించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయినా సరే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క నిరసన కార్యక్రమం చేపట్టలేదు. దాని గురించి మీడియాతో మాట్లాడింది లేదు.. సోషల్ మీడియాలో పోస్ట్ లు లేవు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. నిజంగా పర్యావరణవేత్తలమా లేక ట్రెండింగ్ లో ఉన్న అంశాల విషయంలోనా ఆలోచించుకోవాలని సూచిస్తోంది.
2014 నుంచి 2023 మధ్య కాలంలో 4,28,437 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విక్రయించింది. కోకాపేట్‌లో, 1 ఎకరం 100 కోట్ల వరకు విక్రయించారు. TSIIC మరియు HMDA ఆధ్వర్యంలో వేలం ద్వారా 31,000 కోట్ల రూపాయలను ఆర్జించారు. అప్పుడు పర్యావరణంపై ఈ స్థాయిలో హడావుడి జరగలేదు. పర్యావరణంపై ప్రేమ తప్పు లేదని.. మనం చేసింది ఒప్పు.. రాజకీయ ప్రత్యర్ధులు చేసేది తప్పు అని మాట్లాడటం దారుణం అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినపడుతోంది. ఏఐ వీడియోలు, ఫోటోలతో మాజీ ఐటి మంత్రి చేసే పోస్ట్ లు ఆపాలని.. కల్వకుంట్ల కుటుంబ బినామీలు హైదరాబాద్ లో కట్టిన భవనాలలో కొండలను తొలగించిన విషయాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.