Congress: నాలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ కన్ను.. గెలిస్తే బీజేపీకి చుక్కలే.. ఎల్లుండే కాంగ్రెస్ కీలక భేటీ..!
ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో కనీసం మూడు గెలుచుకున్నా చాలు.. కాంగ్రెస్ దూకుడుకు హద్దే ఉండదు. అందుకే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ నెల 24, బుధవారం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుంది.
Congress: కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపు మీదుంది కాంగ్రెస్. చాలా రోజుల తర్వాత ఆ పార్టీకి దక్కిన భారీ విజయమిది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి మరీ అధికారం చేపట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఇదే స్పీడులో ఇతర రాష్ట్రాల్లో కూడా దూసుకుపోవాలి అనుకుంటోంది. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో కనీసం మూడు గెలుచుకున్నా చాలు.. కాంగ్రెస్ దూకుడుకు హద్దే ఉండదు. అందుకే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ నెల 24, బుధవారం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.
తెలంగాణ, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వీటిలో చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి, సరిగ్గా కష్టపడితే తిరిగి అధికారం చేపట్టడం పెద్ద కష్టం కాదు. మధ్య ప్రదేశ్‌లో కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణలోనూ అధికారం చేపట్టేందుకు అవకాశాలున్నాయి. అందుకే ఈ రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఖర్గే నాయకత్వంలో బుధవారం సమావేశమవుతోంది. పార్టీని నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే అంశంపై బుధవారం జరిగే సమావేశంలో చర్చిస్తారు. పార్టీ గెలుపు అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు వంటివి చర్చించి, తగిన ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ రాష్ట్రాల్లో కూడా కర్ణాటక మోడల్ అమలు చేసి విజయం సాధించాలి అనుకుంటోంది.
ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది?
మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ కర్ణాటకలోలాగా ఆ పార్టీని ఓడించి తిరిగి అధికారం చేపట్టాలనుకుంటోంది. అక్కడ పార్టీని నడిపిస్తున్న కమల్ నాథ్‌కు పార్టీ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అధిష్టానం. చివరకు దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలు కూడా ఆయన ఆధ్వర్యంలో పని చేయాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో పార్టీని అక్కడ అధికారంలోకి తెచ్చే బాధ్యత కమల్ నాథ్ పైనే ఉంది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను సీఎం భూపేష్ బాఘెల్‌కు అప్పగించింది. పార్టీ, ఎన్నికల విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడే జోక్యం చేసుకుంటామని అధిష్టానం చెప్పింది. గతంలో బాఘెల్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత అయిన టీఎస్ సింగ్ డియోతో విబేధాలుండేవి. కానీ, ఇప్పుడు అవి కూడా తొలగిపోయాయి. బాఘెల్ తర్వాత పార్టీలో రెండో స్థానంలో డియో ఉన్నారు. ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలున్నాయి. అయితే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మాత్రం ఈ సారి ఎన్నికలను అశోక్ గెహ్లాట్‌కే వదిలేశారు. సచిన్ పైలట్ తిరుగుబాటు వైఖరి వల్ల అధిష్టానం గెహ్లాట్ వైపే మొగ్గు చూపింది. పార్టీని తిరిగి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత అశోక్ గెహ్లాట్ పైనే ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తక్కువే అని చెప్పాలి. తెలంగాణలో మాత్రం అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. ఈ విషయంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టిపెట్టాల్సి ఉంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడం లేదు. మరోవైపు కేంద్రంలో మోదీపై పెరుగుతున్న వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ వినియోగించుకోవడం లేదు. నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గి, అందరూ ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలుంటాయి.
పార్టీ అంచనాలివి..!
నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. కర్ణాటకలో విజయం ఆ పార్టీ ఇమేజ్ పెంచింది. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా కొంత ఫలితాన్నిచ్చిందని కాంగ్రెస్ నమ్ముతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మోదీ హవా తగ్గుతోందని కాంగ్రెస్ అంచనా. అందువల్ల సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవచ్చని భావిస్తోంది. ఈ నాలుగింటిలో కనీసం మూడు రాష్ట్రాల్లో గెలిచినా.. కాంగ్రెస్ మరింత పుంజుకుంటుంది. అది బీజేపీ ఇమేజ్‌ను భారీగా దెబ్బతీస్తుంది. ఇదే హవాలో వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ ధీమాతో ఉంది. లేదంటే ఎప్పట్లాగే నెమ్మదిగా కాంగ్రెస్ కనుమరుగు దిశగా సాగుతుంది. ఏదేమైనా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.