Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్.. ప్రియాంక, డీకే శివ కుమార్‌కు బాధ్యతలు..?
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీతోపాటు, ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన డీకే శివ కుమార్ తెలంగాణ బాధ్యతలు తీసుకోబోతున్నారు. తెరవెనుక ప్రియాంకా గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకోనుండగా, డీకే శివకుమార్ అన్నీ తానై పార్టీని ముందుండి నడిపించనున్నారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందుకే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీతోపాటు, ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన డీకే శివ కుమార్ తెలంగాణ బాధ్యతలు తీసుకోబోతున్నారు. తెరవెనుక ప్రియాంకా గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకోనుండగా, డీకే శివకుమార్ అన్నీ తానై పార్టీని ముందుండి నడిపించనున్నారు. ఇద్దరి సారథ్యంలో తెలంగాణలో పార్టీ విజయం సాధిస్తుందని ఆశిస్తోంది అధిష్టానం.
రాజకీయ వ్యూహాల్లో దిట్ట డీకే
డీకే శివ కుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రాజకీయ వ్యూహాలు రచించడంలో డీకే దిట్ట. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన అనుసరించిన వ్యూహాల వల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందంటారు. అందుకే తెలంగాణలోనూ డీకే తనదైన వ్యూహాలను అమలు చేయబోతున్నారు. కన్నడనాట బీజేపీ వంటి బలమైన ప్రభుత్వాన్ని కూడా డీకే ఓడించగలిగారు. అలాగే జేడీఎస్ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రత్యేక వ్యూహలు అమలు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలాంటివన్నీ సత్ఫలితాల్నిచ్చాయి. ఇదే తరహా యాక్షన్ ప్లాన్ తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు. ఏ పార్టీ ఎన్నికల్లో గెలవాలన్నీ పోల్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. ఈ విషయంలో డీకే శివకుమార్ ఆలోచనలు సత్ఫలితాల్నిచ్చాయి. పార్టీని కింది స్థాయి వరకు తీసుకెళ్లేలా ఆయన వ్యూహాలుంటాయి.
తెలంగాణలో జోష్
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారే అవకాశాలున్నాయి. కేసీఆర్‌ను ఓడించగలిగే శక్తి తమకే ఉందని నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీ మినహా బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలను ఒకేతాటిపైకి తేవాలని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పని చేసేలా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు, కాంగ్రెస్ అనుకూల ఓట్లు కూడా చీలకుండా తమకు అనుకూలమైన పార్టీలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వీటిని అమలు చేసే బాధ్యత డీకేకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవలి కాలంలో టీ కాంగ్రెస్‌లో చేరికలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీని వెనుక కూడా డీకే శివకుమార్ ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం డీకే కర్ణాటక నుంచే తెలంగాణ పార్టీని సమీక్షిస్తూ, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరే నేతలు కూడా బెంగళూరు వెళ్లి మరీ డీకేను కలుస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న పొంగులేటి, జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి వంటి నేతల చేరికలో శివ కుమార్ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర నేతలు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల కూడా డీకేను కలిసిన సంగతి తెలిసిందే.
గెలుపే లక్ష్యంగా ప్రియాంక వ్యూహాలు
కొంతకాలం నుంచి ప్రియాంకా గాంధీ పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమె ప్రచార బాధ్యతలు తీసుకున్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో పార్టీని విజయపథంలో నడిపించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని గెలిపించే బాధ్యతను ప్రియాంకకు అధిష్టానం అప్పగించింది. ఇప్పుడు తెలంగాణ బాధ్యతలు కూడా తీసుకోబోతుంది. డీకేతో కలిసి ఆమె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు.