ఏకులా వచ్చి మేకు అయ్యాడు.. రేవంత్‌ తిక్క కుదిర్చిన మల్లన్న!

ఇది కావాలి అని ఎప్పుడూ రాజకీయాల్లో డైరెక్ట్‌గా అడగరు.. డిమాండ్ చేయరు ! ముందు పొగబెడతారు.. తర్వాత మంట రాజేస్తారు.. ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది నాయకులు ! తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 05:55 PMLast Updated on: Feb 06, 2025 | 5:55 PM

Congress Highcommand Serious On Teenmar Mallanna

ఇది కావాలి అని ఎప్పుడూ రాజకీయాల్లో డైరెక్ట్‌గా అడగరు.. డిమాండ్ చేయరు ! ముందు పొగబెడతారు.. తర్వాత మంట రాజేస్తారు.. ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలామంది నాయకులు ! తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది. బీసీ నినాదం అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్ మల్లన్న.. సొంత కొంపలో కుంపటి రాజేశారు. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. హన్మకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. సొంత పార్టీలో అగ్గి రాజేస్తున్నాయ్‌. బీసీ రాగం ఎత్తుకున్న ఆయన.. పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చర్చకు దారితీశాయ్.

తీన్మార్‌ మల్లన్న నుంచి వినిపించిన ఈ మాటలే.. ఇప్పుడు తెలంగాణలో కులాలు చిచ్చు రాజేస్తున్నాయ్. ఎమ్మెల్సీ స్థానంలో ఉండి.. ఇవేం దరిద్రపు మాటలు అంటూ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు చాలామంది. పీఎస్‌లో కేసులు పెట్టేశారు మరికొందరు. ఈ మాటలకు తోడు రేవంత్ రెడ్డిపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు మరింత రచ్చ రాజేస్తున్నాయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమని.. తెలంగాణకు రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అన్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని.. బీసీలు ఆర్థికంగా వెనకబడ్డారని చెప్పటం నిజం కాదని.. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు.

ఈ మాటలతో ఆగారా అంటే.. పార్టీ లైన్ క్రాస్ చేసి మరీ.. కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్‌ ఆగ్రహానికి కారణం అవుతోంది. దీంతో మల్లన్నపై చర్యలకు సిద్ధమైంది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే.. ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు మల్లన్న తీరుపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీనా.. కాదా అనేది తీన్మార్ మల్లన్నే డిసైడ్ చేసుకోవాలని అంటున్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని.. కులగణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడటం, కాల్చివేయం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఇలా అరచేతిలో తుఫాన్ అన్నట్లుగా మారింది కాంగ్రెస్‌లో పరిస్థితి. ఐతే ఇంత దారుణంగా మాట్లాడినా.. పార్టీ నిర్ణయాన్ని ఇంతలా వ్యతిరేకించినా.. సీఎం రేవంత్ రెడ్డి కనీసం రియాక్ట్ కావడం లేదు. మౌనం వీడడం లేదు. ఎందుకు అన్నది పక్కనపెడితే.. ఏకులా వచ్చి.. రేవంత్‌కు మల్లన్న మేకులా తయారయినట్లు కనిపిస్తున్నాడు. నిజానికి మల్లన్నకు రేవంత్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. సోనియా దగ్గర మల్లన్న పేరు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లే చెప్పుకొచ్చారు కూడా ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం రేవంత్‌ చాలానే కష్టపడ్డారు కూడా ! అలాంటిది ఇప్పుడు రేవంత్‌కు మేకులా మారిపోయాడు మల్లన్న. మల్లన్న మాటలు కులాల మధ్య చిచ్చు పెడుతుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. రేవంత్‌ సీటు కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నమే.

మరో పదేళ్లు తానే సీఎంను అని రేవంత్‌ అంటుంటే.. రేవంతే చివరి రెడ్డి సీఎం అని.. 2028లో బీసీ బిడ్డే సీఎం అంటూ మల్లన్న స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్‌కు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యమంత్రి సీటు కోసం కాంగ్రెస్‌లో ఇప్పటికీ ఎదురుచూస్తున్న వాళ్లు ఎంతో మంది. ఇన్నాళ్లు అవకాశం లేక.. అవకాశం రాక.. సీఎం సీటుకు దూరంగా ఉండి వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లో.. మల్లన్న మాటలు కొత్త ఆశలు క్రియేట్‌ చేసినట్లే కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒక్క మాటతో రేవంత్‌ సీటు కిందకు నీళ్లు తీసుకువచ్చినట్లే అనే చర్చ జరుగుతోంది. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. బయటకు కనిపించేదేదీ నిజం కాదు రాజకీయంలో ! ఆయన అలా ఎందుకు మాట్లాడారు.. అసలు అలా మాట్లాడొచ్చా.. అలా మంట పెట్టొచ్చా అన్న సంగతి ఎలా ఉన్నా.. అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం రేవంత్‌నే టార్గెట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇంత సెన్సిటివ్ కాబట్టే ఆయన కూడా మౌనంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి మలన్న రేపిన మంట.. కార్చిచ్చుగా మారుతుందా.. మధ్యలోనే కరిగిపోతుందా అని!