Congress: కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌కు జోష్.. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేనా?

ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పార్టీలు నెమ్మదిగా పక్కకు తప్పుకొన్నాయి. దీంతో కాంగ్రెస్ అటు సొంతంగా ఎదగలేక.. ఇటు మిత్రపక్షాల మద్దతు లేక చతికిలపడిపోయింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తిరిగి గత వైభవాన్ని సాధిస్తుందా అనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 07:30 PMLast Updated on: May 15, 2023 | 7:30 PM

Congress In Josh After Karnataka Elections Victory

Congress: ఒకప్పుడు దేశాన్ని కాంగ్రెస్ ఏకఛత్రాదిపత్యంగా ఏలింది. ఎన్ని పార్టీలొచ్చినా కాంగ్రెస్ ధీటుగా నిలబడింది. కానీ, కేంద్రంలో బీజేపీ, మోదీ రాకతో పరిస్థితి తలకిందులైంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఇదే అదనుగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పార్టీలు నెమ్మదిగా పక్కకు తప్పుకొన్నాయి. దీంతో కాంగ్రెస్ అటు సొంతంగా ఎదగలేక.. ఇటు మిత్రపక్షాల మద్దతు లేక చతికిలపడిపోయింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తిరిగి గత వైభవాన్ని సాధిస్తుందా అనిపిస్తోంది. వరుసగా ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తుండటం తాజా పరిస్థితికి నిదర్శనం.
2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ భారీగా బలపడింది. నాలుగైదు రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా సత్తాచాటింది. మరోవైపు కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన మిత్రపక్షాలు కూడా ఆ పార్టీ పరిస్థితి చూసి నెమ్మదిగా దూరమయ్యాయి. వరుస ఓటములు కాంగ్రెస్‌ను మరింత దెబ్బ తీశాయి. పార్టీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. రాజస్థాన్‌లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. గోవా, పంజాబ్, మహారాష్ట్రసహా అనేక రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. యూపీలో కనీస సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ.. ఇలా నాయకత్వ మార్పు కూడా ఆ పార్టీని కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇక కాంగ్రెస్ ఖతమే అన్నారు విశ్లేషకులు. కానీ, తాజాగా కర్ణాటకలో సాధించిన విజయం ఆ పార్టీకి తిరిగి ఊపిరిలూదింది. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని మరోసారి రుజువైంది. ఈ ఫలితాలతో గతంలో దూరమైన పార్టీలు నెమ్మదిగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం అంటే కాంగ్రెసే. కానీ, వరుస ఓటములతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా తమ దారి తాము చూసుకునేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ లేకుండానే కూటమి కడతామంటూ చెప్పుకొచ్చాయి. దేశంలో కీలక పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వంటివి కూడా కాంగ్రెస్‌కు దూరమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ లేని కూటమితోనే జత కడతామని చెప్పింది. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌కు మొండి చేయి చూపారు. తమిళనాడులో డీఎంకే మాత్రం మద్దతు ప్రకటించింది. గతంలో చంద్రబాబు కూడా మద్దతుగా నిలబడ్డా ఇప్పుడా పరిస్థితి లేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అయిన మహా వికాస్ అఘాడి కూలిపోవడంతో అక్కడ కూడా పార్టీ బలహీనపడింది. ఇప్పుడు ఈ పార్టీలన్నింటికీ కాంగ్రెస్ పార్టీనే దిక్కుగా మారబోతుంది.
టీఎంసీ మద్దతుతో మార్పు
మొన్నటివరకు కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ, ఆ పార్టీకి దూరంగా ఉన్న టీఎంసీ ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరయ్యే సంకేతాలు పంపింది. కర్ణాటక ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వైఖరిలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని, అలాగే పశ్చిమ బెంగాల్‌లో తమపై పోరాడకుండా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో త్వరలో కాంగ్రెస్-టీఎంసీ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు పెద్ద విజయంగానే చెప్పుకోవాలి. రాజకీయంగా ఆచితూచి అడుగులేసే మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడిందంటే క్రమంగా ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చేందుకు ముందుకొస్తాయి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకపోయినా.. అవసరమైతే ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎంవీఏ కూటమి తిరిగి బలపడేందుకు ప్రయత్నిస్తోంది. మిత్రపక్షాలు ఇలాగే సహకరిస్తే బీజేపీని కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంటుంది. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కాంగ్రెస్ చక్రం తిప్పే అవకాశం వస్తుంది. తాజా పరిణామాలు చూస్తుంటే తిరిగి కాంగ్రెస్ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. నిజంగానే ఈ వేవ్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనికొస్తుందా? లేదా? కాలమే సమాధానం చెబుతుంది.