Congress Vs Aap: ఇండియా కూటమికి ఎసరు పెడుతున్న కాంగ్రెస్.. ఢిల్లీ ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ.. ఆప్ ఆగ్రహం..
ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, దీనికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సూచించింది. ఇది అక్కడి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆగ్రహం తెప్పించింది. సొంతంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఇండియా కూటమి దేనికని ఆప్ విమర్శించింది.
Congress Vs Aap: ఇండియా కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ పాత్రే కీలకం. ఇతర పార్టీలతో పోలిస్తే ఆ పార్టీకే ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటం చాలా అవసరం. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ విషయం గుర్తించినట్లు లేదు. తాజాగా ఢిల్లీ పార్లమెంట్ స్థానాల విషయంలో ఆ పార్టీ చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, దీనికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సూచించింది. ఇది అక్కడి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆగ్రహం తెప్పించింది. సొంతంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఇండియా కూటమి దేనికని ఆప్ విమర్శించింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి అర్థం లేదని ఆప్ వ్యాఖ్యానించింది. దీంతో వెంటనే తప్పు తెలుసుకున్న కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశం లేదని కాంగ్రెస్ తెలిపింది.
ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. అక్కడ ఏడు ఎంపీ స్థానాలున్నాయి. ఈ స్థానాలు అన్నింట్లో పోటీకి సిద్ధంగా ఉండాలని ఢిల్లీ కాంగ్రెస్ నేత ఆల్కా లాంబా తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్లతో ఆ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాల్లోనే ఆల్కా లాంబా తాజా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పొత్తు పెట్టుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకున్నందువల్ల తాము ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యే అంశంపై పునరాలోచన చేస్తామని తెలిపింది.
ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే.. ఇండియా కూటమికి అర్థం లేదని తెలిపింది. ఆప్ స్పందన గురించి తెలుసుకున్న కాంగ్రెస్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసింది. తమ సమావేశంలో సీట్లు, పొత్తుల గురించి చర్చించలేదని ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఛౌదరి వెల్లడించారు. ఆల్కా లాంబా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పొత్తుల గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఝార్ఖండ్‌లోని 14 ఎంపీ స్థానాలను ఇండియా కూటమి ఎలా కైవసం చేసుకోవాలి అనే అంశంపైనే తమ దృష్టి ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆల్కా లాంబా తాజా వ్యాఖ్యలు ఆప్, కాంగ్రెస్ మధ్య దూరాన్ని పెంచుతాయా..? లేక కాంగ్రెస్ ప్రకటన నేపథ్యంలో ఆప్ శాంతించి, వైఖరి మార్చుకుంటుందా..? అనేది చూడాలి.
కాంగ్రెస్‌కే ముఖ్యం
ఇండియా కూటమి అవసరం ఇతర పార్టీలకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉంది. బలమైన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్.. ప్రస్తుతం బలహీనంగానే కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. ఇలాంటి సందర్భంలో ఆయా పార్టీలను కలుపుకొని, సర్దుకుని పోవడం చాలా ముఖ్యం. కానీ, కాంగ్రెస్ తొందరపాటు చర్యలవల్ల ఆ పార్టీకే చిక్కులు తప్పవు. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటేనే కాంగ్రెస్‌కు మనుగడ. లేదంటే మరోసారి బీజేపీ హవాలో కొట్టుకుపోవడం ఖాయం.