YS SHARMILA: ఢిల్లీకి షర్మిల.. కీలక పదవి ఇవ్వనున్న కాంగ్రెస్..?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె తనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం అడిగారు. కానీ, అదే స్థానం నుంచి సినీయర్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2023 | 01:48 PMLast Updated on: Oct 03, 2023 | 1:48 PM

Congress Party Called Ys Sharmila To Delhi Offer Khammam Mp Seat

YS SHARMILA: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుందా.. లేదా సొంతంగా పోటీ చేస్తుందా అనే విషయంలో పలు ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. షర్మిల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెను తాజాగా ఢిల్లీకి పిలిచింది అధిష్టానం.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె తనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం అడిగారు. కానీ, అదే స్థానం నుంచి సినీయర్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

దీంతో షర్మిల అడిగిన స్థానం ఇచ్చే విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఆమె కూడా పార్టీలో చేరే విషయంలో పునరాలోచనలో పడ్డారు. దీంతో షర్మిల పార్టీ విలీనం ఉంటుందా.. లేదా.. అనే విషయంలో సందేహాలు తలెత్తాయి. కానీ, కాంగ్రెస్ వ్యూహకర్త.. సునీల్ కనుగోలు జోక్యం చేసుకుని, వ్యవహారాన్ని చక్కదిద్దినట్లు తెలుస్తోంది. ఆయన సూచనతో హైకమాండ్ షర్మిలకు ఢిల్లి రావాలని సందేశం పంపింది. దీంతో షర్మిల బుధవారం లేదా గురువారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి, పార్టీ విలీనంపై చర్చిస్తారు.
ఖమ్మం లోక్‌సభ స్థానం
షర్మిలను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే షర్మిలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. దీనిలో భాగంగా షర్మిలకు ఖమ్మం లోక్‌సభ స్థానంతోపాటు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి అంటే ప్రియాంకా గాంధీతో సమాన హోదానే. అయితే, పాలేరు టిక్కెట్ మాత్రం ఇవ్వడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేయనుంది. షర్మిల తాజా పర్యటనలో వీటికి అంగీకరిస్తే.. తన పార్టీ విలీనం ఇక లాంఛనప్రాయమే. అన్నీ ఒక కొలిక్కివస్తే త్వరలోనే తన పార్టీని షర్మిల కాంగ్రెస్‌‌లో విలీనం చేస్తారు. లేదా కథ మళ్లీ మొదటికొస్తుంది.

నిజానికి షర్మిలను అధిష్టానం ఏపీ రాజకీయాల్లోకి రమ్మని కోరింది. కానీ, దీనికి షర్మిల విముఖత చూపింది. తాను తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో షర్మిల కోరుకున్న స్థానం దక్కలేదు. అలాగే తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి వంటి నేతలు షర్మిల రాకను వ్యతిరేకించారు. చివరకు షర్మిల మరో మెట్టు దిగి పాలేరు నుంచి పోటీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రతిపాదనకు ఆమె అంగీకారం చెప్పినట్లు వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి.