YS SHARMILA: షర్మిలకు ‘హ్యాండ్’.. పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకం..!
తాను తెలంగాణలోనే రాజకీయం చేస్తానని, ఏపీలోకి అడుగుపెట్టనని సోనియాగాంధీకి షర్మిల తేల్చి చెప్పడం మైనస్ పాయింట్‌గా మారిందని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత రేణుకా చౌదరి వంటి కీలక నేతలు అభ్యంతరం చెప్పడం కూడా షర్మిలకు ఆటంకంగా మారింది.
YS SHARMILA: షర్మిల రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్‌లో తన రాజకీయ పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేయాలా..? ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలా..? అనే దానిపై ఈనెల 30లోగా షర్మిల నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరకపోతే.. అక్టోబర్ రెండో వారం నుంచి ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను షర్మిల రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా సోనియాగాంధీతో ఆమె నడిపిన రాయబారం పెద్దగా పనిచేయలేదని తెలుస్తోంది. వాస్తవానికి డీకే ఉనికి కర్ణాటకకే పరిమితం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానానికి చేరువగా ఉండే నాయకుల్లో ఆయన నంబర్ చాలా వెనకే ఉంటుంది.
అందుకే షర్మిల అనుకూల రిజల్ట్ సాధించలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు జగన్, షర్మిల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని కాంగ్రెస్ నాయకులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై డీకే శివకుమార్ వంటి వారు కూడా షర్మిల తరఫున రాయబారం నడిపేందుకు మొగ్గుచూపకపోవచ్చని అంటున్నారు. తాను తెలంగాణలోనే రాజకీయం చేస్తానని, ఏపీలోకి అడుగుపెట్టనని సోనియాగాంధీకి షర్మిల తేల్చి చెప్పడం మైనస్ పాయింట్‌గా మారిందని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం బలంగా ఉంది. ఈ తరుణంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత రేణుకా చౌదరి వంటి కీలక నేతలు అభ్యంతరం చెప్పడం కూడా షర్మిలకు ఆటంకంగా మారింది. తెలంగాణ నేతల మాట వినిపించుకోకుండా షర్మిలను పార్టీలోకి తీసుకొని, రాష్ట్రం నుంచి టికెట్ ఇవ్వడం మంచిది కాదనే ఒపీనియన్‌లో హస్తం పార్టీ పెద్దలు ఉన్నారట.
ప్రచారం ముందు.. పదవులు తర్వాత..
వీటన్నింటిపై షర్మిలకు కూడా సమాచారం ఉన్నందున ఆమె తన రాజకీయ భవితవ్యంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్‌తో చర్చలు జరపడం ద్వారా షర్మిల రాంగ్ స్టెప్ వేశారని, తొందరపాటుతో వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ షర్మిలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నా.. ఆమె కోరుతున్న పాలేరు టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఏపీలో, హైదరాబాద్‌లో పార్టీ కోసం ప్రచారం చేయాలని.. ఎన్నికల తర్వాత రాజ్యసభకు లేదా శాసన మండలికి పంపుతామని కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు చెప్పినట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి బాగా ఎదగాలనే టార్గెట్‌తో ఉన్న షర్మిల ఈ తరహా పరోక్ష ప్రాతినిధ్యాన్ని కల్పించే పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరుతారా..? లేదా..? అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది.
వైఎస్సార్టీపీకి తెలంగాణలో మైలేజీ కష్టమే..
వాస్తవం ఏమిటంటే.. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంది. పార్టీలో బలమైన నాయకులు పెద్దగా లేరు. అయినా షర్మిల మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సొంతంగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని గంభీరంగా ప్రకటనలు చేస్తుండడం ఆ పార్టీ నాయకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఏపీలో సోదరుడు జగన్ కోసం ఆమె పోరాడారు. జగన్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. చివరకు జగన్ పట్టించుకోకపోవడంతో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ ఉన్న టైంలో రాజకీయాలు వేరు. రాష్ట్ర విభజన తర్వాతి రాజకీయాలు వేరు. ఇప్పుడు లోకల్ సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ అంశం కారణంగా షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ తెలంగాణలో ఎంత కష్టపడినా పెద్దగా మైలేజీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.