KODANDARAM: కోదండరామ్‌కి ఎంపీ సీటు..! కాంగ్రెస్ ఆఫర్.. అందుకే మద్దతు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ నుంచి తప్పుకుంది. AICC పెద్దలతో పాటు PCC చీఫ్ రేవంత్ రెడ్డి, తదితరులు TJS ఆఫీసుకు స్వయంగా వెళ్ళి.. ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒప్పించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 07:59 PMLast Updated on: Nov 16, 2023 | 7:59 PM

Congress Party Offered Rajyasabha Mp Seat To Kodandaram

KODANDARAM: తెలంగాణలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్న TJS అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కి రాహుల్ గాంధీ మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 7 చోట్ల పోటీ చేద్దామని భావించినా.. కాంగ్రెస్ ఆఫర్‌తో వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ నుంచి తప్పుకుంది. AICC పెద్దలతో పాటు PCC చీఫ్ రేవంత్ రెడ్డి, తదితరులు TJS ఆఫీసుకు స్వయంగా వెళ్ళి.. ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒప్పించారు.

TELANGANA CONGRESS: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు.. ఒకే రోజు ఖర్గే, రాహుల్ రాక

రాష్ట్రంలో నర్సంపేట, సూర్యపేట, జహీరాబాద్, ఎల్లారెడ్డి, ముథోల్, కోరుట్ల, గద్వాల సీట్లలో తమ అభ్యర్థులను బరిలో దింపాలని మొదట TJS భావించింది. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరిగినప్పుడు.. ఈ సీట్లన్నీ తమకు కేటాయించాలని ప్రొఫెసర్ కోదండరామ్ అధిష్టానాన్ని కోరారు. అయితే కాంగ్రెస్ నిర్వహించిన సర్వేల్లో TJS అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని తేలింది. దాంతో పోటీ నుంచి విరమించుకోవాలని కోరింది హైకమాండ్. కోదండరాంను రాజ్యసభకు పంపుతామనీ.. TJS అభ్యర్థులను పోటీకి నిలపవద్దని కాంగ్రెస్ అధినాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఒకవేళ కోదండరాం పోటీ చేస్తానంటే మంచిర్యాల, హన్మకొండ, జనగాం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో తానొక్కడినే నిలబడితే బ్యాడ్ రిమార్క్ పడుతుందని.. కోదండరామ్ తిరస్కరించినట్టు సమాచారం. ఆ తరువాత ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి కోదండరామ్ నిర్ణయించారు.

ప్రొఫెసర్ కోదండరామ్‌ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని రాహుల్ గాంధీ స్పష్టమైన హమీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజ్యసభతో పాటు మూడు ఎమ్మెల్సీలు, 10 కార్పొరేషన్ పదవులను TJS అడిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం రాజ్యసభ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీలు, ఐదు కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే ఈ పదవులపై రాష్ట్ర నేతలతో కాకుండా.. కాంగ్రెస్ హైకమాండ్‌తోనే మాట్లాడి హామీ తీసుకున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో TJS మహాకూటమి తరపున 8 స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కోదండరాం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి.. రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన వారిలో కోదండరామ్ ఒకరు. అందుకే తెలంగాణవాదుల మద్దతు సంపాదించడానికి ఆయన్ని కాంగ్రెస్ దగ్గర తీసినట్టు తెలుస్తోంది.