Jana Reddy: ‘సాగర్’ టికెట్ కు అప్లై చేయని జానా.. వామ్మో ఎంత పెద్ద వ్యూహం ?
కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం జానారెడ్డి మౌనం వెనుక అసలు విషయం ఇదేనా..
కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా టికెట్ కోసం ఏందాకైనా వెళ్తామని వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తుంటే.. ఓ దిగ్గజ నేత మాత్రం టికెట్ కోసం దరఖాస్తు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. ఇతర పార్టీల్లో ఉన్నవాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అప్లై చేసుకుంటుంటే ఆయన మాత్రం కామ్ గా చూస్తుండిపోయారు. అందుకే ఇప్పుడు దిగ్గజ నేత జానారెడ్డి సైలెన్స్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో తలపండిన జానా సైలెన్సును తక్కువగా అంచనా వేయలేమని .. దాని వెనుక పెద్ద కసరత్తే ఉండి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ టికెట్ కోసం జానా అప్లై చేయకున్నా.. ఆయన ఒక కుమారుడు (కుందూరు జయవీర్ రెడ్డి) నాగార్జున సాగర్ టికెట్ కోసం, మరో కుమారుడు (కందూరు రఘువీర్ రెడ్డి) మిర్యాలగూడెం టికెట్ కోసం అప్లై చేశారని గుర్తు చేస్తున్నారు. ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున కేవలం తన కుమారుడి (ఒకే ఒక్క) అప్లికేషన్ మాత్రమే వచ్చేలా చేయగలిగారని చెబుతున్నారు. తద్వారా సాగర్ తన ఇలాఖా అని ఆయన చెప్పకనే చెప్పారని విశ్లేషిస్తున్నారు.
ఇక మిర్యాలగూడ టికెట్ ను ఆశిస్తున్న జానా పెద్ద కుమారుడు కందూరు రఘువీర్ రెడ్డి మాత్రం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 18 మంది అప్లై చేశారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన పోటీదారుల విషయానికొస్తే.. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్), డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. దీంతో మధ్యే మార్గంగా మరో అభ్యర్థి పేరును కాంగ్రెస్ పరిశీలించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే తన కుమారుడు రఘువీర్ రెడ్డికి ఛాన్స్ దక్కొచ్చని జానారెడ్డి అంచనా వేస్తున్నారు. అయితే ఒక కుటుంబం ఒక టికెట్ ఫార్ములా ప్రకారం.. ఏదైనా ఒక టికెట్ నే ఎంచుకోమని జానాకు కాంగ్రెస్ పెద్దలు సూచన చేసే అవకాశమూ లేకపోలేదు. అటువంటి పరిస్థితుల్లో మిర్యాలగూడలో భవిష్యత్తులో తన కుమారుడు రఘువీర్ కు ఏదైనా మంచి అవకాశం దక్కేలా చూస్తామనే హామీ ఇవ్వాలని జానారెడ్డి కోరే ఛాన్స్ ఉంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జానారెడ్డిని ఈసారి నల్లగొండ లోక్ సభ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. జానారెడ్డికి మంచి పట్టున్న మిర్యాలగూడ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలు నల్లగొండ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోకే వస్తాయి. దీని పరిధిలోని కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. దేవరకొండ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ లెక్కన నల్లగొండ లోక్ సభలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్ కు మంచి స్ట్రెంత్ ఉంది. ఇది తనకు కలిసొస్తుందని, ఈజీగానే నల్లగొండ లోక్ సభ సీటును గెలుస్తాననే నమ్మకంతో జానా ఉన్నారట. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండటం జానాకు మరో పెద్ద అడ్వాంటేజ్. ఈసారి హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగాలని ఉత్తమ్ భావిస్తున్నారు.