KTR: సిరిసిల్లలో సీన్ మార్చేందుకు కాంగ్రెస్ స్కెచ్.. కేటీఆర్‌పై ఆ అభ్యర్థి..?

2009 నుంచి సిరిసిల్లలో వరుస విజయాలు సాధిస్తున్న కేటీఆర్‌ను ఢీకొట్టాలంటే.. ఒక స్థిరమైన, బలమైన అభ్యర్థి అవసరం. అయితే ఆ అభ్యర్థిలో ఇవి రెండు లక్షణాలే ఉంటే సరిపోదు. అధికారానికి అతీతంగా నిత్యం ప్రజల్లో ఉండేలా ఆ లీడర్ మెదలాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 08:19 PMLast Updated on: Aug 22, 2023 | 8:19 PM

Congress Trying To Contest Strong Candidate From Siricilla Against Ktr

KTR: సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి చెందినవారు పోటీ చేసే స్థానాలపై యావత్ రాష్ట్రానికి ఆసక్తి ఉంటుంది. విపక్షాలకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంటుంది! బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పే కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలపై కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీలు స్పష్టమైన విజన్‌తో ఉన్నాయి. ఆ స్థానాల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చేందుకు అవి ఇప్పుడు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అందువల్లే సీఎం కేసీఆర్ ఈసారి రెండు స్థానాల (గజ్వేల్, కామారెడ్డి) నుంచి పోటీకి దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తన సిట్టింగ్ సెగ్మెంట్ సిరిసిల్ల నుంచి మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రస్తుతానికి అక్కడ కేటీఆర్‌కు ఫాలోయింగ్ బలంగా ఉంది. కీలకమైన చేనేత కార్మికుల ఓటు బ్యాంకు కేటీఆర్‌వైపే ఉంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ సిరిసిల్లలో కేటీఆర్ మెజారిటీ పెరుగుతూ పోతోంది. అయినా అక్కడ వార్ వన్ సైడ్ కాకుండా చేసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి.
అభ్యర్థులను మార్చి వీకైన విపక్షాలు..
సిరిసిల్లలో కేటీఆర్ బలం సంగతి అలా ఉంచితే విపక్షాల బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడవి ఆ బలహీనతలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీల ప్రధాన బలహీనత.. ప్రతిసారీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడం. 2009 నుంచి సిరిసిల్లలో వరుస విజయాలు సాధిస్తున్న కేటీఆర్‌ను ఢీకొట్టాలంటే.. ఒక స్థిరమైన, బలమైన అభ్యర్థి అవసరం. అయితే ఆ అభ్యర్థిలో ఇవి రెండు లక్షణాలే ఉంటే సరిపోదు. అధికారానికి అతీతంగా నిత్యం ప్రజల్లో ఉండేలా ఆ లీడర్ మెదలాలి. అప్పుడే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల దృష్టిలో కేటీఆర్‌కు సమఉజ్జీగా కనిపించే అవకాశాలు ఉంటాయి. 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండూరు రవీందర్ రావు పోటీచేయగా.. 2019 పోల్స్‌లో ఆ పార్టీ తరఫున కేకే మహేందర్ రెడ్డి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆకుల విజయ పోటీచేయగా.. 2019 పోల్స్‌లో ఆ పార్టీ తరఫున మల్లుగారి నరసాగౌడ్ బరిలోకి దిగారు. ఇలా అభ్యర్థులను మార్చడంలో బిజీగా ఉండిపోయి.. గెలుపు వ్యూహాన్ని రచించడానికి విపక్ష బీజేపీ, కాంగ్రెస్ టైం కేటాయించలేకపోయాయి. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని ఆ పార్టీ వర్గాలే సూచిస్తున్నాయి.
కొండా సురేఖకు అవకాశం ఇస్తే..
కేకే మహేందర్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్‌లో సైలెంట్ అయ్యారు. నియోజకవర్గంలోనూ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. దాంతో.. కాంగ్రెస్ క్యాడర్ అంతా అయోమయానికి గురవుతోంది. ఓ వైపు రాష్ట్రంలో హస్తం పార్టీ దూకుడుగా వెళుతుంటే.. సిరిసిల్లలో మాత్రం గ్రాఫ్ పడిపోతోందనే వాదన వినిపిస్తోంది. దీంతో కొండా సురేఖను సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపాలనే ప్రపోజల్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి కమ్యూనిటీకి చెందిన ఓట్లు దాదాపు 90 వేల పైచిలుకు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. కొండా సురేఖ పద్మశాలి వర్గానికి చెందిన మహిళ కాగా.. ఆమె భర్త కొండా మురళిది మున్నూరు కాపు వర్గం. ఒకవేళ కొండా సురేఖకు ఛాన్స్ ఇస్తే.. సిరిసిల్లలో సీన్ రివర్స్ అవుతుందని, పద్మశాలి, మున్నూరు కాపు ఓటర్లు కాంగ్రెస్ వైపునకు వస్తారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ నుంచి ఇక్కడ కేటీఆర్‌పై బరిలోకి దిగేందుకు బలమైన అభ్యర్థులు లేరు.