అమెరికా అడ్డు తొలగించుకునే కుట్రలు.. తైపీ ఆక్రమణకు డ్రాగన్ సిద్ధమవుతోందా?

మొదట పెట్టుబడుల ఆశజూపుతుంది.. మాట వినకపోతే బెదిరింపులకు దిగుతుంది.. అప్పుడు కూడా దారికి రాకపోతే అంతర్గత కల్లోలం రేపుతుంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2025 | 04:00 PMLast Updated on: Jan 29, 2025 | 4:00 PM

Conspiracies To Remove The American Barrier Is The Dragon Preparing To Invade Taipei

మొదట పెట్టుబడుల ఆశజూపుతుంది.. మాట వినకపోతే బెదిరింపులకు దిగుతుంది.. అప్పుడు కూడా దారికి రాకపోతే అంతర్గత కల్లోలం రేపుతుంది.. చివరికి అనుకున్నది సాధిస్తుంది. చిన్న దేశాలపై డ్రాగన్ ఆక్రమణ కుట్రలు ఇలాగే సాగుతాయి. ఇప్పుడు తైపీ ఆక్రమణలోనూ ఆ వ్యూహాలనే నమ్ముకుంది బీజింగ్. తైవాన్‌కు చైనా పెట్టుబడులు అవసరం లేదు.. కాబట్టి బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూసింది. కానీ, అమెరికా మద్దతుతో తైపీ బెదరలేదు. దీంతో ద్వీప దేశానికి అమెరికా అడలేకుండా చేయాలని మరో కన్నింగ్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. అందుకు తైవాన్‌కు అత్యంత దగ్గరగా ఉండే జపాన్‌ కీలక భూభాగం లో విభజన పాచిక విసిరింది. ఈ టాప్ సీక్రెట్స్‌ను బ్రిటిష్ పత్రిక టెలిగ్రాఫ్ బయటపెట్టింది. దీంతో తమ భూభాగంలో చైనా కుట్రల గురించి తెలుసుకున్న జపాన్ ఒక్కసారిగా షేక్ అయింది. ఇంతకూ, తైవాన్ ఆక్రమణ కోసం బీజింగ్ అమలు చేస్తున్న కుట్రలేంటి? టెలిగ్రాఫ్ బయటపెట్టిన సంచలన కథనంలో ఏం ఉంది? ఇవాల్టి టాప్ స్టోరీలో తెలుసుకుందాం..

తైవాన్.. 2.3కోట్ల జనాభా ఉండే చిన్న ద్వీపదేశం. ఈ పేరు వినపడగానే వెంటనే డ్రాగన్ కంట్రీ స్ఫురణకు వస్తుంది. ఎందుకంటే, ఈ దేశంపై డ్రాగన్ కన్ను ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా తైపీ ఆక్రమణ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న తైవాన్‌ను.. 70 ఏళ్లుగా మాతృ దేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తోంది చైనా. జిన్‌పింగ్ తలచుకుంటే తైవాన్‌ను ఆక్రమించుకోవడం ఒక్కరోజులో జరిగే పని. కానీ, ఆ ధైర్యం చేస్తే అమెరికా అడ్డంగా చైనాపై పడిపోతుంది. అదే జరిగితే ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది తెలుసు కాబట్టే తైవాన్ ఆక్రమణ విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది జిన్‌పింగ్ సర్కార్. అలా అని తైవాన్‌పై కుట్రలు మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణకు అడ్డుగా ఉన్న అమెరికాను వ్యూహాత్మకంగా తప్పించాలని కుట్రలు చేస్తోంది. అందుకు జపాన్‌ భూభాగంలో విభజన చిచ్చు రేపుతోంది.

ఒకినావా.. తైవాన్‌కు కేవలం 750 కిలోమీటర్ల దూరంలో ఉండే జపాన్ కీలక భూభాగం. డ్రాగన్ ఇక్కడే విభజన కుట్రలకు తెరలేపింది. ఒకినావాలోని వేర్పాటువాదులకు బీజింగ్ నిధులు సమకూర్చడం మొదలు పెట్టింది. వారందరినీ జపాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమే చైనా లక్ష్యం. అదే జరిగితే ఒకినావా ప్రాంతం జపాన్ నుంచి వేరుపడుతుంది. తద్వారా అక్కడ చైనా పెత్తనం మొదలవుతుం ది. ఈ మిషన్‌లో విజయం సాధిస్తే తైపీ ఆక్రమణ చైనాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే తైవాన్‌కు సపోర్ట్‌గా నిలిచేందుకు అమెరికా సేనలు ఉన్నది ఒకినావాలోనే. వివరంగా చెప్పాలంటే ఒకినావాలో 30వేలమంది అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్‌కు చెందిన సేనలను అమెరికా ఒకినావాలో మోహరించింది. తైవాన్‌పై ఎప్పుడైతే చైనా సైనిక చర్యకు దిగుతుందో అప్పుడే ఈ దళాలు యాక్టివ్ అవుతా యి. నిమిషాల్లోనే తైపీకి మద్దతుగా యుద్ధంలోకి దిగుతాయి. ఇది తెలుసు కాబట్టే ఒకినావా నుంచి అమెరికా ను తరిమేయాలని చూస్తోంది బీజింగ్. అందుకు స్థానిక వేర్పాటువాదులకు భారీ ఎత్తున నిధులు పంపించి విభజన విత్తులు నాటుతోంది. ఈ రహస్యాలనే టెలిగ్రాఫ్ బయటపెట్టింది. స్థానికుల్లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించడం ద్వారా ఒకినావాలో చైనా నిశ్శబ్ద దండయాత్ర చేస్తోందని పేర్కొంది.

ఇతర దేశాల్లో చైనా కుట్రలు ఎవరి ఊహకూ అందని రీతిలో ఉంటాయి. ఆయా దేశాల్లో చైనా జాతీయులను అందుకు వ్యూహాత్మకంగా వాడుకుంటుంది. డ్రాగన్ కంట్రీ చాలా దేశాల్లో సీక్రెట్ పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తోంది. కానీ వీటిని సర్వీస్ స్టేషన్లు అని మాత్రమే పిలుస్తోంది. ప్రపంచ దేశాల్లో చైనా ఇలాంటి 54 అక్రమ పోలీస్ స్టేషన్లను నిర్మించిందని గతంలో ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ రహస్య పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా కొన్ని దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తోందని తేలింది. కెనడా మొదలు.. యూకే, జర్మనీ, స్పెయిన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనీస్ పోలీస్ స్టేషన్‌ల కోసం ఇటువంటి వ్యవస్థలను కలిగి ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు తేల్చాయి. ఒకినావాలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చైనా భావించింది. అక్కడి చైనా జాతీయులతో రహస్య పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించినట్టు టెలిగ్రాఫ్ తేల్చింది. అంతేకాదు, ఒకినావాలోని చాలా మంది స్థానికులు తమ స్వాతంత్ర్యానికి చైనా మద్దతిస్తోందని నమ్ముతున్నారు. దీన్నిబట్టి అక్కడ చైనా కుట్రలు ఫలితం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

నిజానికి.. ఒకినావా దీవిలో అమెరికా సైన్యం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అందుకు కారణం అగ్రరాజ్యం సైనికుల అరాచకాలే. 2024లో ఓ బాలికపై సైనికుడు అత్యాచారం చేయడంతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. గతంలో కూడా అమెరికా సైనికులు చేసిన తప్పుడు పనులపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. 1955లో అమెరికా సైనిక సిబ్బంది ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు. 1970లో ఒకినావాలో మూడువేల మంది స్థానికులకు, అమెరికా మిలటరీ పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. అగ్రరాజ్య సైనిక వాహనం చేసిన రోడ్డు ప్రమాదమే దీనికి కారణం. 1995లో అమెరికా మెరైన్‌ ఒకరు 12 ఏళ్ల స్థానిక బాలికను అపహరించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకే స్థానికులు అమెరికా సైన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకినావాలో ఈ పరిస్థితులనే చైనా తనకు అనుకూలంగా మార్చు కోవాలనుకుంటోంది. ఈ విషయంలో విజయం సాధిస్తే తైవాన్‌ కథ ముగిసినట్టే.