అవినీతి మచ్చ ముంచేసింది.. ఆప్ ఓటమికి కారణాలివే

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. తమకు తిరుగులేదనుకున్న పార్టీలు సైతం ఘోరపరాభవం చవిచూసిన సందర్భాలున్నాయి... అన్నిసార్లు ప్రజలు ఆదరించరనే దానికంటే కొన్నిసార్లు చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2025 | 06:14 PMLast Updated on: Feb 09, 2025 | 6:14 PM

Corruption Has Become A Stain These Are The Reasons For Aaps Defeat

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. తమకు తిరుగులేదనుకున్న పార్టీలు సైతం ఘోరపరాభవం చవిచూసిన సందర్భాలున్నాయి… అన్నిసార్లు ప్రజలు ఆదరించరనే దానికంటే కొన్నిసార్లు చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి… ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ… దేశరాజకీయాల్లో సమూల మార్పులు తెస్తామంటూ వచ్చి ఆరంభంలోనే సంచలనం సృష్టించింది ఆప్… అవినీతి లేని పరిపాలనే తమ లక్ష్యమంటూ అడుగుపెట్టిన ఆ పార్టీ చివరికి అదే అవినీతి ఆరోపణలతో ఓటమి పాలైంది. దీంతో 27 ఏళ్ళుగా ఢిల్లీలో అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి అధికారాన్ని అప్పగించక తప్పలేదు. ఆప్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. దీనిలో మొదటికి ప్రజావ్యతిరేకత..

క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 2012లో జన్ లోక్‌పాల్ కోసం అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంతో పాటుగా అతని నివాసానికి సంబంధించిన షీష్‌మహల్ ఎపిసోడ్ ఆప్, కేజ్రీవాల్ నిజాయితీ ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. సీఎం అయినా కూడా సాధారణ వ్యక్తిగానే జీవిస్తాను అంటూ మొదట్లో హడావుడి చేసిన కేజ్రీవాల్ క్రమంగా సగటు పొలిటికల్ లీడర్ గా మారిపోయారు. విలాసవంతమైన భవన నిర్మాణం కేజ్రీవాల్ పై వ్యతిరేకతకు మొదటి బీజం వేసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ కూడబెట్టిన ఆస్తులు, విలాసవంతమైన భవనం, అందులో వస్తువుల్ని బీజేపీ శీష్ మహల్ రూపంలో జనంలోకి తీసుకెళ్లింది. దీంతో కేజ్రివాల్ పై ఉన్న క్లీన్ ఇమేజ్ మొత్తం పోయింది. కేజ్రీవాల్ కూడా ప్రస్తుత రాజకీయనాయకుల్లో ఒకరిగా మారిపోయారని భావించారు.

దశాబ్దకాలంగా ఢిల్లీని ఏలుతున్న కేజ్రివాల్ ప్రభుత్వం .. ఈ పదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో కీలక మార్పులు తెచ్చింది. అలాగే విద్యుత్, తాగునీటి సబ్సిడీలు కూడా ఓటర్లకు మేలే చేశాయి. కానీ ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన ఆప్ సర్కార్.. కేంద్రంపై నెపం నెట్టేసింది. అలాగే ఢిల్లీకి తాను ఏం చేయాలన్నా కేంద్రం అడ్డుపడుతోదంటూ కేజ్రివాల్ పదే పదే చెప్పిన కారణాన్ని ఇన్నాళ్లూ నమ్మిన ఓటర్లు.. ఇక చేసేది లేక అదేదో బీజేపీకే అధికారం ఇచ్చి చూద్దామని భావించారని ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ అభివృద్ధి విషయంలో కేజ్రివాల్ ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉండిపోవడం కూడా ప్రభావం చూపింది.

ఇక కేజ్రీవాల్ ప్రభుత్వానికి లిక్కర్ స్కామ్ అతిపెద్ద మచ్చగా మిగిలిపోయింది. మద్యం కుంభకోణంలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు రావడం ఢిల్లీ ప్రజలకు షాక్ ఇచ్చింది. ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాకున్నా వరుస కేసులతో సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ కీలక నేతలను జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టులోనూ చాలారోజుల వరకూ వీరెవరికీ బెయిల్ రాకపోవడం వారిపై ఉన్న మచ్చను నిజం చేసేసింది. లిక్కర్ స్కామ్ లో ఆప్ నేతలపై ఆరోపణలు దర్యాప్తు సంస్థలు రుజువు చేయలేకపోయాయి. అయితే ప్రజల్లో మాత్రం వారంతా అవినీతిపరులుగా ముద్ర పడిపోయింది. అందుకే జైలుకు వెళ్ళి వచ్చిన సానుభూతి కూడా ఎన్నికల్లో వీరిని రక్షించలేకపోయింది.

అటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు, జైలు, కోర్టు కేసులతోనే ఆప్ నేతలంతా సమయాన్ని గడుపుతుండడంతో సహజంగానే పాలన గాడి తప్పింది. పైగా జైలుకు వెళ్లిన సరే రాజీనామా చేయకుండా కేజ్రీవాల్ చాలా రోజులు గడిపేశారు. ఆప్ తన ప్రజల సమస్యలను పక్కనపెట్టి, రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తుందన్న భావన కూడా ఢిల్లీ ప్రజల్లో వచ్చేసింది. ముఖ్యంగా ఇచ్చిన హామీలను చాలావరకూ నెరవేర్చకపోవడం కూడా దెబ్బతీసింది. ఉచితాలను పంపిణీ చేస్తామని ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ, ఆప్ ను ప్రజలు నమ్మలేదు. బీజేపీ కూడా ఉచితాల హామీలతోనే మేనిఫెస్టోను తీసుకురావడంతో ఢిల్లీ వాసులు కమలం వైపు మొగ్గారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లోమాత్రం ఒంటరిగానే బరిలోకి దిగడం కూడా దెబ్బేసింది. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం మధ్యలో బీజేపీకి కలిసొచ్చింది. అటు నాలుగోసారి అధికారంలోకి రావాలనుకునే క్రమంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి పెరిగి ఎన్నికలకు ముందు పలువురు బీజేపీకి మద్ధతిచ్చారు. మొత్తం మీద కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ పోయి అవినీతి మచ్చతో పాటు సగటు రాజకీయ నాయకుడిగా మారిపోయారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయిన వేళ ఆప్ అధినేతకు ఘోరపరాభవం తప్పలేదు.