Telangana BJP: ఈటల, కోమటిరెడ్డికి హైకమాండ్ ఏం చెప్పింది..? బీజేపీలోనే ఉంటారా..? వెళ్తారా..?

జేపీ నద్దాతో తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారబోతున్నారు అన్న ప్రచారం నేపథ్యంలో అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వీళ్లు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 25, 2023 | 10:53 AMLast Updated on: Jun 25, 2023 | 10:53 AM

Crisis In Telangana Bjp Etela Rajender And Komatireddy Will Continue In Bjp Or Not

Telangana BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారబోతున్నారు అన్న ప్రచారం నేపథ్యంలో అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వీళ్లు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా ఈటల, కోమటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి నిర్మొహమాటంగా జేపీ నద్దాకు వివరించినట్లు చెప్పారు. తమ అభిప్రాయాల్ని వారితో పంచుకున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో బీజేపీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈటల, కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో అధిష్టానం ఉంది. దీనిలో భాగంగా వీరితో నద్దా, అమిత్ షా సమావేశమయ్యారు. వీరి అసంతృప్తికి గల కారణాల్ని అధిష్టానం తెలుసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నద్దాకు వివరించారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఓడించే లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్లు, అయితే.. ఇప్పుడు పరిస్థితులు బీఆర్ఎస్‌తో బీజేపీ రాజీపడిందా అన్నట్లు తయారయ్యాయని నద్దాకు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎందరినో అరెస్టు చేసినప్పటికీ కవితను అరెస్టు చేయకపోవడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని తెలంగాణ సమాజం భావిస్తోందిన నద్దాకు వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారంతోపాటు, కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిందని చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరివల్లే పార్టీకి నష్టం జరుగుతోందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి అభిప్రాయాలు విన్న జేపీ నద్దా వారిని పార్టీలో ఉండాలి అని సూచించినట్లు తెలుస్తోంది.
పార్టీ మారుతారా..? కొనసాగుతారా..?
అధిష్టానంతో చర్చించినప్పటికీ ఈటల, కోమటిరెడ్డి మాటల్లో స్పష్టత కనిపించలేదు. అధిష్టానం విషయంలో పూర్తి సంతృప్తితో కనిపించలేదు. వారి వ్యాఖ్యల్లో పార్టీ మారబోమని స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. దీంతో వీళ్లు పార్టీ మారుతారా..? లేక అధిష్టానం మాటకు విలువిచ్చి బీజేపీలోనే కొనసాగుతారా..? అనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. బీజేపీ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటేనే బీజేపీలో కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ప్రచారం జరుగుతున్నట్లు ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరి కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యం..
తెలంగాణలో అధికారమే లక్ష‌్యంగా తమ పార్టీ పని చేస్తుందని ఈటల, కోమటిరెడ్డికి నద్దా చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవడమే బీజేపీ టార్గెట్ అని ఆయన స్పష్టంగా వివరించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఇద్దరికీ సూచించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌పై బీజేపీ తీవ్ర పోరాటం చేయబోతుందని చెప్పారు.