Etela Rajender: ఢిల్లీ కేంద్రంగా మంతనాలు.. హై కమాండ్ ఈటెలకు ఏం ఆఫర్ చేయబోతోంది..
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలను బీజేపీ హై కమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇద్దరితో మంతనాలు జరుపుతోంది. ఉన్నఫలంగా ఢిల్లీకి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కబురుపెట్టింది బీజేపీ హై కమాండ్.
Etela Rajender: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరబోతుండటంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. దీంతో ఇప్పుడు చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలో చాలా కాలం నుంచి ఇమడలేకపోతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదే విషయంలో ఆయన తన హుజురాబాద్ అనుచరులతో మంతనాలు కూడా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలను బీజేపీ హై కమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇద్దరితో మంతనాలు జరుపుతోంది. ఉన్నఫలంగా ఢిల్లీకి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కబురుపెట్టింది బీజేపీ హై కమాండ్. దీంతో హైదరాబాద్‌లో ఉన్న కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు.
అయితే తెలంగాణ బీజేపీ అంతర్గత విషయాలు మాట్లాడేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కాకుండా కిషన్ రెడ్డిని పిలవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. చాలా రోజుల నుంచి బీజేపీలో బండి సంజయ్‌కి కొందరు సీనియర్ నేతలకు పొసగడంలేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఈ విషయం పార్టీ హైకమాండ్‌కు తెలిసినా బండి సంజయ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించింది. దీంతో పార్టీ నేతలు పక్కచూపులు పట్టారు. ఇప్పుడు ఈ ఇష్యూను పరిష్కరించేందుకే ఢిల్లీ పెద్దలు కిషన్ రెడ్డి, ఈటెల, కోమటిరెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం.
అయితే పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ ఈటలకు ఏం ఆఫర్ ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. రీసెంట్‌గా చాలా రోజులు తెలంగాణ బీజేపీకి ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ టాక్ నడిచింది. కానీ హైకమాండ్ మాత్రం బండి సంజయ్‌ని కంటిన్యూ చేస్తున్నామంటూ ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది. ఇప్పుడు పార్టీ నుంచి ఈటెల వెళ్లకుండా చేసేందుకు అధ్యక్ష పదవినే ఆఫర్ చేసే అవకాశం ఉంది.