Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ కలిసి వెళ్తాయా..? పురందేశ్వరి ఏం చెప్పారంటే..
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయని పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో పొత్తు, ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Daggubati Purandeswari: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కలిసి పోటీ చేస్తాయా.. లేదా.. అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవైపు రెండు పార్టీలూ ఏపీలో కలిసే ఉన్నామని చెబుతుంటాయి. కానీ, కలిసి పని చేసిన దాఖలాలు లేవు. మరోవైపు జనసేన.. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా జనసేన, టీడీపీతో కలుస్తుందా.. లేదా.. అనే విషయంలో సందేహాలున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం.. తమతో బీజేపీ కలిసి వస్తుందని నమ్ముతున్నారు.
RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన: రాహుల్ గాంధీ
కానీ, ఇంతవరకు ఈ విషయంలో బీజేపీ నుంచి సరైన స్పష్టత లేదు. కానీ, తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ అంశంపై స్పందించారు. ఏపీలో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయని పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో పొత్తు, ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. వైసీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని పురంధేశ్వరి తెలిపారు. నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసి, కక్ష సాధింపు రాజకీయాలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
మరోవైపు ఏపీలో జనసేన, టీడీపీ ఇప్పటికే కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నాయి. నియోజకవర్గ స్థాయి వరకూ సమన్వయం కోసం సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. రెండు పార్టీల నేతలు కలిసి పని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా బీజేపీని కలుపుకుని పోవాలని అనుకోవడం లేదు. బీజేపీ గురించి పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.