అప్పుల కుప్ప అమెరికా…!

పేరు గొప్ప... ఊరు దిబ్బ... ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే... గోల్డ్‌కార్డులు అమ్ముకుంటున్నా... విదేశాలకు ఇచ్చే సాయం ఆపేస్తున్నా... ఖర్చుల కోతకు సై అంటున్నా అందుకు పైకి కనిపించే కారణం మాత్రమే ట్రంప్... అసలు కథ వేరే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 05:45 PMLast Updated on: Mar 03, 2025 | 5:45 PM

Debt Heap America

పేరు గొప్ప… ఊరు దిబ్బ… ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే… గోల్డ్‌కార్డులు అమ్ముకుంటున్నా… విదేశాలకు ఇచ్చే సాయం ఆపేస్తున్నా… ఖర్చుల కోతకు సై అంటున్నా అందుకు పైకి కనిపించే కారణం మాత్రమే ట్రంప్… అసలు కథ వేరే ఉంది. అమెరికా ఇప్పుడు అప్పుల ఊబిలో అల్లాడుతోంది. ఆ దేశానికి ఎంత అప్పుందో చెప్పాలంటే ఒక్కో అమెరికన్‌పై ఉన్న కనీస అప్పు 91 లక్షల రూపాయలు… పైకి సూటేసుకుంటున్నారు కానీ లోపలంతా చిరుగులే అన్నమాట..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అంటే అందరూ తడుముకోకుండా చెప్పే పేరు అమెరికా.. మరి ఎక్కువగా అప్పులున్న దేశం అంటే ఏ అర్జంటీనా అనో లేదంటే వెనుజులా అనో చెబుతారు. అదీ కాదంటే మన దేశమేనా అని కాస్త డౌట్‌గానే అడుగుతాం. కానీ ప్రపంచంలో ఎక్కువ అప్పులున్న దేశం అమెరికానే…అంటే అప్పుల్లోనూ అగ్రరాజ్యం అమెరికానే అన్నమాట. ప్రస్తుతం ఆ దేశం అప్పుల కుప్ప… పైకి అంతా బాగానే ఉన్నా అమెరికా ఎప్పుడో రుణఊబిలో చిక్కుకుపోయింది. అగ్రరాజ్యం కావడంతో ఎలాగోలా నెట్టుకొస్తోంది కానీ ఆ దేశ పరిస్థితి ఐసీయూలో ఉంది. ఏ క్షణం అప్పులు అణుబాంబులా పేలి అమెరికాను ముంచేస్తాయోనని అగ్రరాజ్యం వణికిపోతోంది.

అంత పెద్ద దేశానికి ఆ మాత్రం అప్పులుండవేంటి అనకండి. ఇంతకీ ఆ దేశానికి ఉన్న రుణం ఎంతో తెలుసా… 27 ట్రిలియన్ డాలర్లు… నెంబర్ కాస్త చిన్నగా ఉన్నట్లుంది కదా.. సరే దాన్ని మన కరెన్సీలోకి మార్చి చెప్పుకుందాం…గుండె చేత్తో పట్టుకుని వినండి. 1 ట్రిలియన్ డాలర్లంటే 87లక్షల 47వేల కోట్లు. మరి 27 ట్రిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా…. అయితే చూడండి… రూ.2,32,80,69,57,50,00,000 ( GFX 10 SEC)… అంత కష్టపడకండి… 23 కోట్ల 28లక్షల కోట్ల కోట్లు… అంటే అప్పుతోనే ఆ దేశానికి తెల్లారుతుందన్నమాట. అంత అప్పు ఉంది కాబట్టే ట్రంప్ పరిస్థితిని గాడిన పెట్టడానికి తిప్పలు పడుతున్నారు. అందుకే గోల్డ్ కార్డ్స్ అమ్ముతానంటున్నారు. వివిధ దేశాలకు సాయంలో కోత పెడుతున్నారు.

మరి అమెరికానేనా ఇంకే దేశాలకు అప్పులు లేవా అంటే ఎందుకు లేవు. చాలాదేశాలు అప్పులతోనే బండి లాగేస్తున్నాయి. అమెరికా అంత కాకపోయినా ఈయూకు కూడా భారీగా అప్పులున్నాయి. దాని రుణభారం 17.8 ట్రిలియన్ డాలర్లు. యూకేకు 9.79 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌కు 7.6 ట్రిలియన్, జర్మనీకి 7.12, జపాన్‌కు 4.2, నెదర్లాండ్స్ 4.14, లక్సంబర్గ్ 3.9, ఐర్లండ్‌కు 3.2, కెనడాకు 3.12 ట్రిలియన్ డాలర్ల రుణాలున్నాయి. మనం మాత్రం టాప్-10లో కూడా లేములేండి. మనకున్న అప్పులు కూడా తక్కువేమీ కాదు. మనకున్న రుణాలు మొత్తం 219లక్షల కోట్లు.. మన జీడీపీతో పోల్చితే అప్పులు దాదాపు 70శాతం అన్నమాట. మన దేశంలో ఒక్కొక్కరిపై లక్షా 60వేల రూపాయలపై లోను ఉన్నట్లే. ఓ రకంగా చూస్తే అమెరికా కంటే మనం ఎంతో బెటర్.

ఇంతకీ అమెరికాకు ఎందుకు ఇన్ని అప్పులు అవుతున్నాయంటే ఆ దేశం పెట్టే రక్షణ వ్యయం చాలా ఎక్కువ. పన్నుల కంటే ఖర్చులు ఎక్కువ. అమెరికాలో పన్నులు పెంచాలంటే మనలాగా ఒక్క సంతకంతో అయిపోదు. దానివెనక చాలా లెక్కలుంటాయి. ఇక ఆ దేశానికి ఇంత, ఈ దేశానికి ఇంత అంటూ సాయం అందించేది. పైగా ఇతర దేశాల వ్యవహారాల్లోనూ తలదూర్చడం దానికి అలవాటు. తమ అనుకూల ప్రభుత్వాలు రావడం కోసం వందలు, వేల కోట్లు తగలేసింది. అంతెందుకు ఉక్రెయిన్ యుద్ధంలో 5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆప్ఘాన్‌ యుద్ధంలోనూ తక్కువేమీ కాలేదు. తాలిబన్ల ఏరివేత ఏమోకానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైపోయింది. అలా క్రమక్రమంగా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి. అలా అప్పులు తెచ్చి చేసిన సోకులు ఇప్పుడు భరించలేని స్థాయికి చేరుకున్నాయి.

సరే అప్పులు బాగా ఉన్న దేశాల గురించి ఇంత చెప్పుకున్నాం కదా.. అసలు అప్పులు లేని దేశాలు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి. హాంకాంగ్, బ్రూనై, తైమూర్ లెస్టే వంటి దేశాలకు అసలు అప్పులే లేవు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అసలు ఆ దేశాలకు అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. సరైన ఆర్థిక విధానాలతో ఆ దేశాలు రుణ ఊబిలో చిక్కుకోకుండా కళకళలాడుతున్నాయి.