Modi Qualification: ప్రధాని మోదీ విద్యార్హతలపై వివాదమేంటి..?
ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతల వివరాలు అడిగిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు 25వేల రూపాయల జరిమానా విధించింది. ఇంతకీ మోడీ విద్యార్హతలపై వివాదమేంటి..? కేజ్రీవాల్ ఎందుకంత పట్టుదలగా పోరాడారు.?
ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. మోడీ విద్యార్హతల వివరాలు బయటపెట్టాల్సిన పనిలేదని సూచించింది. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. గుజరాత్ యూనివర్శిటీకి ఊరట కల్పించింది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పత్రాలను అడగడం ద్వారా కేజ్రీవాల్ ఉద్దేశం పలు అనుమానాలకు తావిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివాదాన్ని సృష్టించడానికే కేజ్రీవాల్ ఆర్‌టీఐ మార్గాన్ని ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్‌కు 25వేల రూపాయల ఫైన్ వేసింది కోర్టు. నాలుగు వారాల్లో దాన్ని చెల్లించాలని ఆదేశించింది.
ప్రధాని నరేంద్రమోడీ 1978లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ పొందారు. ఇక 1983లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి ఆర్స్ట్‌లోనే మాస్టర్స్ చేశారు. ఆ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. గూగుల్‌లో కొట్టినా ఆ కాపీలు దొరికేస్తున్నారు. అయితే మోడీ విద్యార్హతలపై కేజ్రీవాల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా ఆయన దీనిపై పోరాటం చేస్తున్నారు. 2016లో ఆప్ ప్రధాని విద్యార్హతలపై ఆర్‌టీఐని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్‌టీఐ ఆ వివరాలు వెల్లడించాలని ప్రధాని కార్యాలయం, ఢిల్లీ యూనివర్శిటీ, గుజరాత్ యూనివర్శిటీలను ఆదేశించింది. దీనిపై స్పందించిన గుజరాత్ యూనివర్శిటీ వెంటనే ప్రధాని మోడీ పీజీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసింది.
కేజ్రీవాల్ ఆరోపణలతో బీజేపీ కూడా ప్రధాని విద్యార్హతల వివరాలను డిగ్రీ సర్టిఫికెట్ కాపీలను బయటపెట్టింది. అయినా కేజ్రీవాల్ మాత్రం వెనక్కు తగ్గలేదు. కోర్టులో పోరాటానికే మొగ్గుచూపారు. ఇటీవల దీనిపై విచారణ జరిగింది. గుజరాత్ యూనివర్శిటీ తరపున సొలిసిటరల్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పబ్లిక్‌గా వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇలా అడగడంలో దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. అసలు ప్రధాని పదవికి విద్యార్హతలతో సంబంధం లేదన్నారు. ఏ రాజకీయ నాయకుడికీ పలానా విద్యార్హత ఉండాలని ఎక్కడా నిబంధనలు లేవన్నారు. ప్రధాని విద్యార్హతల వివరాలు అందుబాటులోనే ఉన్నాయన్నారు. ప్రధాని వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా కేజ్రీవాల్ తీరు ఉందని వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టానికి కూడా చురకలు అంటించారు. నేనేం టిఫిన్ తిన్నానో అడగకూడదని కావాలంటే దానికి ఎంతైందని మాత్రమే అడగొచ్చని సెటైర్ వేశారు తుషార్ మెహతా. కేజ్రీవాల్ తరపు లాయర్లు కూడా గట్టిగానే వాదించినా ఉపయోగం లేకపోయింది. ఇరువైపుల వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ ఆశ్చర్యాన్నే వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అడిగితే ఫైన్ వేస్తారా అన్నారు. సరైన విద్యార్హత లేని ప్రధాని దేశానికి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే అవకాశం ఈ దేశ ప్రజలకు లేదా అని కూడా ప్రశ్నించారు.
ఆప్, బీజేపీలు రాజకీయ ప్రత్యర్థులు. రాజకీయ విమర్శలు సహజమే. కానీ ప్రధాని విద్యార్హతలపై లేనిపోని వివాదాలు సృష్టించేలా ఆప్ వ్యవహరించడాన్నే ఇక్కడ కోర్టు తప్పుపట్టింది. పోనీ ఆప్‌కు ఏమైనా అనుమానాలుంటే దానికి తగిన ఆధారాలు సంపాదించాక న్యాయపోరాటానికి దిగాల్సింది. అలాంటిదేమీ లేకుండా మొండిగా ముందుకెళ్లారు. మోడీ సమర్పించిన విద్యార్హతలు తప్పు అనుకుందామా అంటే గుజరాత్ యూనివర్శిటీ కూడా అవి ఒరిజినల్సేనని కోర్టుకు తేల్చిచెప్పింది. పబ్లిక్‌గా వాటిని ఉంచింది. అలాంటప్పుడు లేనిపోని పోరాటమెందుకన్నది కేజ్రీవాల్‌కే తెలియాలి. ప్రధానితో కేజ్రీవాల్ రాజకీయ పోరాటం చేస్తే బాగుంటుంది. రాజకీయంగానే ఆయన్ను ఎదుర్కొంటే సరిపోయేది. ప్రధాని నిర్ణయాల్లో లోపాలుంటే దాన్ని ఎత్తిచూపొచ్చు. ఆయన తప్పులు చేస్తే వాటిని ఎండగట్టొచ్చు. కానీ వ్యక్తిగత వివరాలపై ఎందుకంత ఆసక్తి అన్నదే ప్రశ్న. అది కూడా ఎలాంటి అనుమానాలు లేనప్పుడు. పైగా ఇప్పుడు దేశంలో ప్రధాని మోడీ విద్యార్హతలపై పెద్ద చర్చ కూడా లేదు. పోనీ కేజ్రీవాలే గెలిచినా అది దేశ ప్రజలకు ఉపయోగ పడేది కాదు. కోర్టు ఆ సర్టిఫికెట్లు చూపించాలని చెప్పి యూనివర్శిటీ వాటిని అందించిందే అనుకోండి కేజ్రీవాల్ వాటిని ఏం చేసుకుంటారు..? అలాంటప్పుడు అనవసర ప్రయాస ఎందుకన్నదే ప్రశ్న. పోనీ ఏమైనా అనుమానాలుంటే వాటిని బహిరంగంగానే చెప్పొచ్చు కదా..! కోర్టు తీర్పు తర్వాత కూడా సరైన విద్యార్హతలు లేని ప్రధాని అని ట్వీట్ చేయడం ద్వారా కేజ్రీవాల్ మరో తప్పు చేసినట్లే కనిపిస్తోంది. మాస్టర్స్ చదివిన వ్యక్తిని సరైన విద్యార్హతలు లేవని ఎలా అంటారు..?