Delhi Ordinance: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు..? పార్లమెంటులో కీలకం కానున్న వైసీపీ మద్దతు..? ఆ పార్టీ వైఖరేంటి..?

ఢిల్లీలో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం చేతిలో ఉన్న అనేక అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక అధికారాలను కోల్పోనుంది. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 18, 2023 | 02:46 PMLast Updated on: Jul 18, 2023 | 2:46 PM

Delhi Ordinance Case Bjp Remains Confident On It Because Of Ysrcp And Bjd

Delhi Ordinance: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కారణం.. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లుతోపాటు, ఢిల్లీపై ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుండటమే. ఈ బిల్లులను ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే,ఈ బిల్లులు బీజేపీకి అత్యంత కీలకం కానున్నాయి. ఈ బిల్లుకు సంబంధించి వైసీపీ, బీజేడీ మద్దతు కీలకం కానుంది.
ఢిల్లీలో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం చేతిలో ఉన్న అనేక అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక అధికారాలను కోల్పోనుంది. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే ఢిల్లీ పరిధిలో అధికారంలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారాలు తగ్గుతాయి. అందుకే ఈ బిల్లును ఆమ్ ఆద్మీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే అనేక ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఇంతకాలం ఎటూ తేల్చకుండా ఉంది. కానీ, తాజాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా, కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నట్లు చెప్పింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే విషయమే. అయితే, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినంత మాత్రాన ఈ బిల్లు పార్లమెంటులో ఓడిపోతుంది అని చెప్పడానికి వీల్లేదు. కారణం.. వైసీపీ, బీజేడీ.
వైసీపీ మద్దతు కీలకం..
లోక్‌సభలో అత్యధిక ఎంపీలున్న ఐదో పెద్ద పార్టీ వైసీపీ. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్నది వైసీపీనే. కాబట్టి పార్లమెంటులో ఏ బిల్లు నెగ్గాలన్నా వైసీపీ మద్దతు కీలకం. ఇక బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రవేశపెట్టే బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇస్తుంది. వైసీపీకి లోక్‌సభలో 22 మంది ఎంపీలున్నారు. అలాగే ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ (బీజేడీ-నవీన్ పట్నాయక్) కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నారు. ఈ బిల్లు నెగ్గాలంటే బీజేపీ, మిత్ర పక్షాలతోపాటు వైసీపీ, బీజేడీ మద్దతు కూడా చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ బిల్లు గెలవడం ఖాయం. ఎందుకంటే బీజేపీ సంఖ్యాబలంతో పోలిస్తే ప్రతిపక్షాల బలం తక్కువ. అందులోనూ వైసీపీ, బీజేడీ మద్దతు ఉంది కాబట్టి ఈ బిల్లును బీజేపీ సులభంగా నెగ్గించుకుంటుంది. ఒకవేళ వైసీపీ, బీజేడీల్లో ఏదో ఒక్క పార్టీ వ్యతిరేకించినా బిల్లు ఓడిపోవడం ఖాయం.
వైసీపీ ఓటు బీజేపీకే
అధికారం చేపట్టినప్పటి నుంచి వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. ఏపీకి నిధులు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విషయాల్లో కేంద్రం మొండిచేయి చూపించినప్పటికీ వైసీపీ మద్దతు మాత్రం ఇస్తూనే ఉంది. ఇక వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మద్దతు చాలా అవసరం. అందువల్ల బీజేపీని వైసీపీ వ్యతిరేకించే అవకాశమే లేదు. ఏ లెక్కన చూసినా వైసీపీ మద్దతు బీజేపీకే ఉంటుంది. అయితే, ఈ బిల్లు విషయంలో ఇప్పటివరకు అనేక పార్టీలు తమ వైఖరి వెల్లడించాయి. చాలా పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కానీ, వైసీపీ మాత్రం ఇంకా తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా.. వైసీపీ ఎవరికి మద్దతు ఇస్తుందో తెలిసిందే.