ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి ఎవరీ రేఖా గుప్తా…బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

ఢిల్లీ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి రేఖా గుప్తాను వరించింది. సీనియర్లను కాదని...అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎంపిక చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 08:00 AMLast Updated on: Feb 20, 2025 | 5:46 PM

Delhis Fourth Woman Chief Minister Rekha Gupta What Is The Background

ఢిల్లీ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి రేఖా గుప్తాను వరించింది. సీనియర్లను కాదని…అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా…నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా పని చేయనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ నేతలు ఎవరికి వారు…తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. పలువురు సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ…రేఖా గుప్తా వైపే కాషాయ పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. షాలిమార్‌బాగ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంచారు. ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ…కమలం పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మహిళా ముఖ్యమంత్రులు లేకపోవడం…రేఖా గుప్తాకు కలిసి వచ్చింది. ఢిల్లీలో బీజేపీ తరపున రెండో మహిళా ముఖ్యమంత్రి పని చేయబోతున్నారు.

గతంలో బీజేపీ నుంచి దివంగత నేత సుష్మాస్వరాజ్‌ ఒకసారి, కాంగ్రెస్ నుంచి దివంగత నేత షీలా దీక్షిత్‌…15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. రేఖా గుప్తా ముందు…ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆతిశీ సీఎంగా సేవలు అందించారు. 50 ఏళ్ల రేఖా గుప్తాకు…ఏబీవీపీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏబీవీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో పలు విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ సేవలందించారు.

రేఖా గుప్తా…1974 జులై 19న హర్యానాలోని జుల్నాలో జన్మించారు. చిన్న వయసులోనే ఆరెస్సెస్‌ భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. ఢిల్లీ వర్సిటీలో విద్యనభ్యసించారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2007లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. పీతమ్ పుర నుంచి తొలిసారి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందారు. 2012లో రెండోసారి అక్కడి నుంచే విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా… పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు.

తనపై నమ్మకం ఉంచి…సీఎం బాధ్యతల్ని అప్పగించిన పార్టీ నాయకత్వానికి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకం, మద్దతు…కొత్త శక్తిని ఇస్తాయన్నారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయతీతో, అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నూతన సభాపక్ష నేతగా ఎన్నికైన రేఖా గుప్తాకు కాషాయ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. 70 సీట్లకు గాను…ఏకంగా 48 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. 27 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఈసారి ఏకంగా 40సీట్లు కోల్పోయి 22కే పరిమితమైంది. కాంగ్రెస్ మరోసారి​ ఖాతా తెరవలేకపోయింది.