Delimitation: డీ లిమిటేషన్ దగా.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. తగ్గనున్న లోక్‌సభ సీట్లు

పార్లమెంట్ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియ 2026లో జరగనుంది. జనాభా ప్రాతిపదికన ‪లోక్‌సభ సీట్ల కేటాయింపు జరుగుతుందని కేంద్రం తెలిపింది. దీనికి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 07:20 PMLast Updated on: May 31, 2023 | 7:20 PM

Delimitation Of Lok Sabha Seats Sparks Concerns Of Great Injustice To South States

Delimitation: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దక్షిణాది నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తోంటే.. నిధుల కేటాయింపు మాత్రం తక్కువగానే ఉంటోంది. కేంద్ర సంస్థలు, ప్రాజెక్టులు, పదవుల కేటాయింపు.. ఇలా ఏ అంశంలో చూసుకున్నా దక్షిణాది రాష్ట్రాలకు తగిన న్యాయం జరగడం లేదన్నది ఇక్కడి నాయకుల అభిప్రాయం. దీన్ని మరోసారి బలపరిచేలా సాగనుంది లోక్‌సభ సీట్ల డీ లిమిటేషన్. ఈ విషయంలో కేంద్రం పాటించబోయే విధానం వల్ల ఇక్కడి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించాలని కేటీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలను కోరారు.
జనాభా ప్రాతిపదికన అన్యాయం
పార్లమెంట్ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియ 2026లో జరగనుంది. జనాభా ప్రాతిపదికన ‪లోక్‌సభ సీట్ల కేటాయింపు జరుగుతుందని కేంద్రం తెలిపింది. దీనికి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఆయన చెప్పిన వాదన ప్రకారం.. ఈ పద్ధతిలో నియోజకవర్గాలను విభజించడం, సీట్లు కేటాయించడం చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయి. దీనివల్ల ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ వంటి పార్టీలే బలపడతాయి. అధికారం దక్కించుకుంటాయి. దీన్ని కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు. జనాభాను నియంత్రించేందుకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా కృషి చేశాయి. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గింది.

గతంలో జనాభా విషయంలో కేంద్ర సూచనలను ఇక్కడి రాష్ట్రాలు పాటించినందువల్ల ఇప్పుడు సీట్ల కేటాయింపులో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు కేటీఆర్. కేంద్ర సూచనలను పట్టించుకోని ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని, దీంతో అక్కడి రాష్ట్రాలకు అధిక సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. కేంద్ర నిర్ణయం వల్ల ప్రగతిశీల విధానాలను అనుసరించి జనాభాను నియంత్రించిన తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దక్షిణాది జనాభా 18 శాతమే.. కానీ, దేశానికి దక్షిణాది రాష్ట్రాలు అందిస్తున్న స్థూల జాతీయోత్పత్తి వాటా 35 శాతంగా ఉంది. అయితే, లోక్‌సభ సీట్ల డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాదికి తక్కువ స్థానాలు దక్కుతాయి. 20 శాతం సీట్లే దక్షిణాదికి దక్కుతాయి. దీంతో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. అందుకే ఈ నిర్ణయంపై ఇక్కడి రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీయాలని కేటీఆర్ కోరారు.
పెరగనున్న సీట్ల సంఖ్య
ప్రస్తుతం పార్లమెంటులో 1971 జనాభా లెక్కల ప్రకారం 543 స్థానాలున్నాయి. అయితే, 2026 జనాభా లెక్కల ప్రకారం ఈ సీట్ల సంఖ్య పెరుగుతుంది. 848 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. తాజా అంచనా ప్రకారం ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 165 సీట్లు (20 శాతం) దక్కుతాయి. మిగతా 638 స్థానాలు (80 శాతం) ఇతర రాష్ట్రాలకు దక్కుతాయి. దీని వల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల వాణి వినిపించేందుకు అవకాశం ఉండదన్నది నిపుణుల మాట. అందుకే ఈ నిర్ణయం మార్చుకోవాలని కేటీఆర్ సహా వివిధ నేతలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.