గన్నవరం-గుడివాడ సరిహద్దుల్లో నానీ-వంశీ కబ్జాలు చేసారా…?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసులు పాత కేసులన్నీ బయటకు లాగుతున్నారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయి మాట్లాడిన వల్లభనేని వంశీ పై ఒక్కో కేసు బయటకు వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 05:50 PMLast Updated on: Feb 27, 2025 | 5:50 PM

Did Nani Vamsi Encroach On Gannavaram Gudivada Borders

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసులు పాత కేసులన్నీ బయటకు లాగుతున్నారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయి మాట్లాడిన వల్లభనేని వంశీ పై ఒక్కో కేసు బయటకు వస్తోంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఆయన చేసిన దందాలకు సంబంధించి ఒక్కో కేసును బయటకు లాగుతున్నారు పోలీసులు. తాజాగా గన్నవరం లో 10 కోట్ల విలువైన స్థలాన్ని ఆయన కబ్జా చేశారని ఒక కేసు నమోదు అయింది. ఇక రైతులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా ఆయన దోచుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

2019 నుంచి 2024 వరకు వల్లభనేని వంశీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కేసులను కూడా నమోదు చేస్తున్నారు. తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ పై పిటి వారెంట్ కూడా దాఖలైంది. త్వరలోనే మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు గుడివాడ గన్నవరం నియోజకవర్గ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ భూములను ఆక్రమించినట్లు ప్రచారం జరుగుతుంది.

ముఖ్యంగా దేవుడు మాన్యాలను వల్లభనేని వంశీ ఆక్రమించారని ఆరోపణలు వినపడుతున్నాయి. దాదాపు 250 నుంచి 300 ఎకరాలు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు పోలీసులు అలాగే రెవిన్యూ అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయ భూముల కబ్జాల విషయంలో కూడా వల్లభనేని వంశీ హస్తం ఉందని, వాటిని కూడా తన వశం చేసుకునేందుకు ప్రయత్నించారు.. అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో దానికి సంబంధించిన కేసులు కూడా వంశీ పై నమోదయ్య అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వంశీని ప్రభుత్వం కాస్త సీరియస్ గానే తీసుకుంది. గతంలో రెచ్చిపోయిన వంశీ అత్యంత దారుణంగా చంద్రబాబునాయుడు కుటుంబాన్ని మాట్లాడారు. దీనితో వంశీ విషయంలో సానుభూతి కూడా పెద్దగా రాకపోవడంతో.. వైసీపీ కూడా వంశీ విషయంలో ముందు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక వంశీని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా.. పెద్దగా ఫలించడం లేదని చెప్పాలి.

ఇక కొడాలి నానితో కలిసి గన్నవరం తో పాటుగా గుడివాడ పట్టణంలో కూడా వంశీ కొన్ని కబ్జాలకు పాల్పడ్డారు అని ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇప్పటికే ఆ భూములను కూటమి వచ్చిన తర్వాత యజమానులకు అప్పగించారు. అలాగే విజయవాడలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను వీళ్ళిద్దరూ బెదిరించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఇప్పటికే వంశీ వ్యవహారంపై నలుగురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.