హైడ్రాతో రేవంత్ తప్పు చేశారా.. గ్రేటర్ ఎన్నికల్లో ఎఫెక్ట్ తప్పదా ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు పార్టీకి మైలేజ్ తీసుకురావడంతో పాటు, వ్యక్తిగతంగాను తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు పార్టీకి మైలేజ్ తీసుకురావడంతో పాటు, వ్యక్తిగతంగాను తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలోని వ్యతిరేక వర్గాన్ని కూడా దారికి తెచ్చుకుని… ఇటు రాష్ట్రంలోనూ, అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటిసమయంలో హైడ్రాని ఏర్పాటు చేయడమే కాకుండా… నగర పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను, షాపింగ్ కాంప్లెక్స్‌లను కూల్చి వేస్తున్నారు. ఆ భవనాలు చాలావరకు రాజకీయ ప్రముఖులతో పాటు, వీవీఐపీలకు చెందినవి అయినా… రేవంత్ మాత్రం లెక్క చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఐతే హైడ్రా పేరుతో రేవంత్ లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారని పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట.
ఎవరూ బహిరంగంగా విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు కానీ… అధిష్టానం పెద్దలకు మాత్రం రేవంత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇలాంటి చర్యలు పార్టీని దెబ్బతీస్తాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కూల్చివేతలలో బడా పారిశ్రామిక వేత్తలు , రాజకీయ నాయకులవే కాకుండా , సామాన్యులకు చెందిన భవనాలను కూడా కూల్చేయడం.. కాంగ్రెస్‌కు దెబ్బ అనే అభిప్రాయం చాలామంది నేతల్లో వినిపిస్తోంది. ఐతే రేవంత్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా వ్యవహారంలో వ్యక్తిగతంగా రేవంత్ ఇమేజ్ పెరిగినట్టే కనిపిస్తున్నా…. రాజకీయంగా మాత్రం ఆయనకు, కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.