Spl Story: లిక్కర్ సిండికేట్ వీరయ్య చౌదరి ప్రాణం తీసిందా..?
నాగులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరయ్య చౌదరి

నాగులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరయ్య చౌదరి టిడిపి అధికారంలో వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగించింది. టిడిపి అగ్ర నాయకత్వానికి వీరయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ప్రధానంగా మంత్రి నారా లోకేష్ కు ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రను ప్రకాశం జిల్లాలో ముందుండి నడిపించాడు వీరయ్య చౌదరి.
అలాంటి వ్యక్తిని హత్య చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిడిపి కార్యకర్తలు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆయన శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నాయి. అయితే ఇది ఎవరు చేశారు అనేదానిపై క్లారిటీ లేకపోయినా బీహార్ గ్యాంగ్ అనేది ప్రధాన ఆరోపణ. బీహార్ నుంచి వచ్చిన ముఠానే ఆయనను హతమార్చిందని.. ఇక్కడున్న కొంతమంది వారికి హత్యకు సుపారి ఇచ్చారని టిడిపి ఆరోపిస్తోంది.
ఈ హత్య వెనక ప్రధాన కారణాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలియకపోయినా.. లిక్కర్ సిండికేట్ కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే భూ తగాదాలు కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చు అనేది ప్రధాన అనుమానం. లిక్కర్ సిండికేట్ విషయంలో వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది అనేది కూడా ప్రధానంగా వినపడుతోంది. దీనితోనే కొంతమంది ఆయనపై కక్ష పెంచుకొని ఉండవచ్చు అని భావిస్తున్నారు.
సీసీ కెమెరాలుకు సైతం దొరకకుండా ముసుగు వేసుకుని వెళ్లి దాడి చేసి ఆయనను హతమార్చారు. అయితే నియోజకవర్గంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న అనుమానం. వీరయ్య చౌదరి కాస్త దూకుడుగా ఉండే నాయకుడు. అధిష్టానం మద్దతు కూడా ఉండటంతో ఆయన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గమైన సరే ఆయన మాటకు బలం ఎక్కువ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కావడంతో పార్టీ క్యాడర్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు వీరయ్య మేనల్లుడు. ఏది ఎలా ఉన్నా ఈ హత్య మాత్రం ఇప్పుడు టిడిపి క్యాడర్ను భయపెడుతోంది. వైసిపి హయాంలో భయపడని నాయకులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. మరి దీనిపై పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి. హోం మంత్రి ఆదేశాలతో మొత్తం 13 బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.