జగన్ కు సొంత జిల్లాలో కష్టాలు.. ఆ ఎంపీ కూడా వదిలేశారా…?
కడప జిల్లాలో వైసిపి ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ ఊహించని ఎదురు దెబ్బతిన్నది. ఏకంగా ఏడు స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలవడం..
కడప జిల్లాలో వైసిపి ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ ఊహించని ఎదురు దెబ్బతిన్నది. ఏకంగా ఏడు స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలవడం.. ఆ పార్టీ జీర్ణించు కోలేని పరిస్థితుల్లో ఉంది. పార్టీలో కీలక నాయకులు జిల్లా నుంచి ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ కు ముందు నుంచి అండగా నిలబడే నాయకులు ఉన్నారు. అయితే వాళ్లందరూ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం.. ఆ పార్టీ అధిష్టానం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుందట.
కార్యకర్తలు కూడా ఈ విషయంలో బయటకు రాలేక, ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతున్నారు. ముఖ్యంగా జగన్ కు అండగా నిలబడిన నేతల్లో.. రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముందు ఉంటారు. శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి జగన్ తో కలిసి నడిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉండటం.. ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదే పదే మీడియాలో కనపడిన ఈ నాయకులు ఇద్దరూ ఇప్పుడు మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో టీడీపీ వ్యతిరేక కార్యక్రమాలను వీళ్ళిద్దరూ కలిసి నడిపించేవారు. అయితే ఇప్పుడు మాత్రం వీళ్లు బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. కేసుల భయంతో అలాగే వ్యక్తిగత కారణాలతో పార్టీ జెండా మోయడానికి కూడా ఇద్దరూ ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విషయంలో టిడిపి అధిష్టానం సీరియస్ గానే ఉంది.
ఆయన నియోజకవర్గంలో హత్య రాజకీయాలు చేశారని అప్పట్లో నారా లోకేష్ పెద్ద ఎత్తున ఆరోపించారు. దీనితో ఆయనను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉండొచ్చు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పటివరకు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డిని అరెస్టు చేయలేదు. అలా అని ఆయన బయటకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక శ్రీకాంత్ రెడ్డి విషయంలో కూడా అప్పట్లో టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆయన కూడా ఇప్పుడు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇక జిల్లాలో అవినాష్ రెడ్డి అత్యంత కీలకంగా ఉన్నారు.
ఆయన వివేకానంద రెడ్డి కేసు విషయంలో భయపడుతున్నారు. అందుకే పెద్దగా మీడియా ముందు కూడా మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. అటు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కూడా పెద్దగా జిల్లాలో యాక్టివ్ గా కనపడలేదు. తన తండ్రిపై కేసులు నమోదు కావడంతో ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. చిత్తూరు, కడప జిల్లాలను కలుపుకుని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. అయితే ఆయన తిరిగినా చిత్తూరు జిల్లా పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నారు. కానీ కడప జిల్లా విషయంలో మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని జిల్లా నేతలు అంటున్నారు.