DK Aruna: రాజకీయ వి.. చిత్రం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న బీజేపీ ఉపాధ్యక్షురాలు..!
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ నుంచి, గద్వాల అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు.
DK Aruna: బీజేపీ జాతీయాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ సూచించింది. ఇక్కడే విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. డీకే అరుణ.. ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాంగ్రెస్ తరఫున. అయితే, ప్రస్తుతం ఆమె బీజేపీలో జాతీయాధ్యక్షురాలిగా కొనసాగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి వస్తే ఏ పార్టీ తరఫున కొనసాగుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదో విచిత్రమైన పరిస్థితిగా విశ్లేషకులు చెబుతున్నారు.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ నుంచి, గద్వాల అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు. కృష్ణమోహన్ రెడ్డికి 1,00,057 ఓట్లు రాగా, డీకే అరుణకు 71,12 ఓట్లు వచ్చాయి. దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని, ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు నమ్మింది. అయన ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, ఆయన తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీంతో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఇటీవల ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసినప్పటికీ ప్రయోజనం కలగలేదు. తాజాగా ఈ అంశంపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాల్ని అసెంబ్లీ కార్యదర్శి వెంటనే అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కార్యదర్శిని కలుస్తానని అరుణ అన్నారు.
ఏ పార్టీ నుంచి..?
ఒకవేళ డీకే అరుణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి ఒప్పుకొన్నా.. ఆమె ఏ పార్టీ నుంచి ప్రమాణం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాంగ్రెస్ నుంచి. ప్రస్తుతం ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ విషయంలో చట్టం ఏం చెబుతుంది..? న్యాయ నిపుణుల అభిప్రాయాలేంటి..? అనే అంశాలపైనే ఆమె రెండు పార్టీల నుంచి కొనసాగే అవకాశం ఉందో, లేదో తెలుస్తుంది.