సెక్యూరిటీ కావాలా నాయనా..Z + ఆ.. Z ++ ఆ …?

వైసీపీ అధినేత వైయస్ జగన్ కు జడ్ ప్లస్ భద్రత కావాల్సిందేనా...?అంటే వైసిపి నాయకులు అవుననే సమాధానం చెబుతున్నారు. జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 12:45 PMLast Updated on: Feb 24, 2025 | 12:45 PM

Does Ycp Chief Ys Jagan Need Jud Plus Security

వైసీపీ అధినేత వైయస్ జగన్ కు జడ్ ప్లస్ భద్రత కావాల్సిందేనా…?అంటే వైసిపి నాయకులు అవుననే సమాధానం చెబుతున్నారు. జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జగన్ ఇంటి బయట జరిగిన మూడు అగ్ని ప్రమాదాల ఘటనపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి జగన్ భద్రత ప్రశ్నార్థకమైందంటూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. ఇక తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వైఎస్ జగన్ వెళ్ళగా అక్కడ కూడా జగన్ భద్రతపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే జగన్ కు నిజంగా జెడ్ ప్లస్ భద్రత కావాలా..? అంటే దీనిపై వైసీపీ నేతల వద్ద సరైన సమాధానం లేదు. కేవలం ఇంటి బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటన అలాగే మిర్చి యార్డ్ లో భద్రత లోపాలు వంటివి చూపిస్తూ వైసిపి జగన్ కు జడ్ ప్లస్ భద్రతను డిమాండ్ చేస్తుంది. అయితే జెడ్ ప్లస్ భద్రత ఇవ్వడానికి బలమైన కారణాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద ముప్పు లేదంటే మావోయిస్టులతో తీవ్రమైన ముప్పు ఉన్న సమయంలోనే జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ ఉంటారు. మావోయిస్ట్ ల ప్రభావం లేదంటే అంతర్జాతీయ సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలలో మాత్రమే జెడ్ ప్లస్ భద్రతపై కేంద్రం పరిశీలిస్తుంది.

ప్రజా ఉద్యమాల్లో సాయుధ తీవ్రవాద దళాలు పాల్గొనే అవకాశం ఉన్నా, రాష్ట్రంలో గన్ కల్చర్ లేదంటే మాఫియా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనే భద్రతపై కేంద్రం సున్నితంగా పరిశీలిస్తుంది. 2003లో చంద్రబాబు నాయుడు పై అలిపిరి వద్ద మావోయిస్టులు బలమైన దాడి చేయడంతో అప్పట్లో చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఉత్తరప్రదేశ్ లో మాఫియా గ్యాంగ్ లు తీవ్రంగా ఉండటంతో యోగి ఆదిత్య నాథ్ కు భద్రతను కల్పిస్తున్నారు. దేశంలో అతి తక్కువ మందికి మాత్రమే ఈ భద్రతను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఎన్ ఎస్ జి కమాండోలతో చంద్రబాబు నాయుడుకి ఈ భద్రతను అందిస్తున్నారు. 40 మంది వీఐపీలకు మాత్రమే దేశంలో ఈ భద్రత ఉంది. 36 మంది సిబ్బందితో కూడిన భద్రతా విభాగం వీరిలో 10 కంటే ఎక్కువ మంది సిఆర్పిఎఫ్ కమాండోలు అలాగే పోలీస్ సిబ్బంది లేదంటే ఎన్ ఎస్ జి సిబ్బంది ఉంటారు. దేశంలో అతి తక్కువ మందికి మాత్రమే ఎన్ ఎస్ జి కమాండల భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పుడు జగన్ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో వైసిపి ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను డిమాండ్ చేస్తుంది.

గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం కేంద్ర ప్రభుత్వానికి జగన్ భద్రతపై ఓలేఖ రాసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఉగ్రవాదులతో ముప్పు ఉందని.. అందుకే ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరింది. ఇక జగన్ భద్రత కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. రూల్స్ ప్రకారం 10 శాతం మంది సభ్యులు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. ఇక ప్రతిపక్ష నాయకుడికి భారీగా భద్రత ఉంటుంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే జడ్ ప్లస్ భద్రతలో భాగంగా ఎన్ ఎస్ జి కమాండోలను కొంతమంది వీఐపీ లకు తగ్గించేశారు. చంద్రబాబు నాయుడు అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లకు మాత్రమే ఎన్ ఎస్ జి భద్రత ఉంటుంది.