ట్రంప్ అంటే కంపే…! ఈ నాలుగేళ్లూ కెలకడమే పని
ట్రంప్ వచ్చాడు... మళ్లీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు.. వాళ్లని వీళ్లని అని కాదు అన్ని దేశాలను ఓ రౌండ్ వేసేస్తున్నాడు. మెక్సికోతో కయ్యానికి దిగాడు. కెనడాను కెలికాడు...
ట్రంప్ వచ్చాడు… మళ్లీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు.. వాళ్లని వీళ్లని అని కాదు అన్ని దేశాలను ఓ రౌండ్ వేసేస్తున్నాడు. మెక్సికోతో కయ్యానికి దిగాడు. కెనడాను కెలికాడు… చైనాతో చెడుగుడు ఆడేస్తానంటున్నాడు… నెక్స్ట్ మనమే మరి..! ఈ పిచ్చోడితో నాలుగేళ్లు ప్రపంచం ఇలా వేగాల్సిందేనా….!
క్యారెక్టర్ కొత్తగా ఉందని ఎన్నికలకు ముందు ట్రై చేశారు కానీ ఒరిజినల్ అలాగే ఉందని మరోసారి నిరూపిస్తున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్… అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎవరో ఒకరిని కెలకడం మొదలుపెట్టేశారు. అధ్యక్షుడిగా ఫస్ట్‌టర్మ్‌లో ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. మధ్యలో ఓటమి దెబ్బకు ఆ నాలుగేళ్లలో కాస్తో కూస్తో మార్పు వచ్చిందేమనని అంతా అనుకున్నారు కానీ… అలా మారితే ఆయన ట్రంప్ ఎందుకవుతారు…! మళ్లీ తన అసలు క్యారెక్టర్‌ను బయటకు తీశారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్లకు పిచ్చెక్కించడమే కాకుండా ప్రపంచాన్ని కూడా కలవరపెడుతున్నారు ట్రంప్.
మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఆ దేశం నుంచి ఇక ఎవరూ రావటానికి వీల్లేదని హుకుం విధించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేస్తామంటూ కవ్వింపు కామెంట్లు చేశారు. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25శాతం టారిఫ్ విధించబోతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై కూడా సంతకం పెట్టారు. మా దేశంలో ఓ రాష్ట్రంగా ఉండిపోండి అంటూ కెనడాకు ఆఫర్ ఇచ్చిన ట్రంప్… ఇప్పుడు టారిఫ్ విధించడం ద్వారా కయ్యానికి కాలు దువ్వారు. పవర్‌ఫుల్ డ్రగ్ ఫెంటనిల్, అక్రమ వలసదారులు కెనడా నుంచి వస్తున్నారన్నది అమెరికా వాదన. కాస్తో కూస్తో ఉండొచ్చు కానీ దానికి ఈ మాత్రం రియాక్ట్ కావాలా అన్నది కెనడా వాదన. సరిహద్దు దేశాలు కాబట్టి వాటితో కయ్యం పెట్టుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదు.
చైనాతో కూడా ట్రేడ్‌వార్‌కు సై అన్నాడు ట్రంప్. డ్రాగన్ ప్రొడక్ట్స్‌పై 10శాతం టారిఫ్ విధిస్తానని అధ్యక్షుడి హోదాలో ప్రకటించారు. ఫిబ్రవరి1నుంచే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చైనా నుంచి ఫెంటనిల్ కెనడాకు వస్తోందని అక్కడ్నుంచి తమదేశంలోకి ప్రవేశిస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు.
గతంలోనూ చైనాతో కయ్యానికి కాలుదువ్వారు ట్రంప్. ఇప్పుడు కూడా సమరానికి సై అంటున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. చైనా కూడా కాస్తో కూస్తో బలపడింది. దీంతో ఈసారి ట్రేడ్ వార్ చాలా గట్టిగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మాపై పన్నులు వేస్తే ఏం చేయాలో మాకు తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చింది. టారిఫ్ వార్‌లో ఎవరూ విజేతలు ఉండరని తెలుసుకోవాలని ట్రంప్‌కు సలహా ఇచ్చింది బీజింగ్. అమెరికాకు ఎక్కువ దిగుమతులు కెనడా, మెక్సికో, చైనా నుంచే వస్తాయి. ఇప్పుడు ఆ మూడు దేశాలను కెలకడం ద్వారా పన్నుల యుద్ధానికి తెరలేపారు.
చైనానే కాదు యూరోపియన్ యూనియన్‌ను కూడా వివాదంలోకి లాగారు ట్రంప్. మాతో చాలాదారుణంగా వ్యవహరిస్తున్నారు… మీకు అందుకు పన్నులు తప్పవని హెచ్చరించారు. అటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. చర్చలకు వచ్చి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవని చెప్పారు. ఇక పనామా కాలువను తీసుకుంటామంటూ మరో కొత్త వివాదాన్ని కెలికారు. దీనిపై పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ ములినో స్పందించారు. మీరు మాకు దాన్ని గిఫ్ట్‌గా ఇవ్వలేదు అది మాదే అని తెలుసుకోమంటూ చురకలు వేశారు.
అన్ని దేశాలను కెలికారు కానీ మన జోలికి రాలేదని ఊపిరి పీల్చుకుంటున్నారా.. ఆగండి.. మనపైనా పడబోతున్నారు. త్వరలో మనల్ని కూడా ముంచేసే ప్లాన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంది. బ్రిక్స్ దేశాలపై వందశాతం పన్నులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ దేశాల్లో మనం కూడా భాగమే. మనం అమెరికా ఉత్పత్తులపై భారీగా పన్నులు వేస్తున్నామని మొదట్నుంచి ట్రంప్ వాదిస్తున్నారు. ప్రచారంలో అయితే మనపై అభ్యంతరకరమైన కామెంట్లు కూడా చేశారు. కాబట్టి త్వరలోనే భారత్ ఉత్పత్తులపైనా భారీగా పన్నులు వేసే అవకాశం ఉంది. ఇంతేనా అనకండి మరికొన్ని దేశాలను కూడా తన హిట్‌లిస్ట్‌లో చేర్చేశారు ప్రెసిడెంట్..
మొత్తంగా రాగానే ప్రపంచ దేశాలను కెలకడం మొదలుపెట్టారు ట్రంప్. మీరు మాతో సరిగా లేకపోతే మీకే నష్టం అంటూ అదో వార్నింగ్. అంతేకాదు తమ ఉత్పత్పులపై పన్నులు తగ్గించేలా చేసి వాటి మార్కెట్ పెంచడం ఆయన అసలైన టార్గెట్. మాటలతో వినకపోతే చేతల ద్వారానే అనేది ట్రంప్ జడ్జ్‌మెంట్. కాబట్టి మరో నాలుగేళ్లు ప్రపంచదేశాలకు ఈ పన్ను పోటు ట్రంప్ కాటు తప్పదు.. దానికి తగ్గట్లు ప్రిపేరైపోండి.