హమాస్‌కు నరకం చూపిస్తా అన్న ట్రంప్ , గాజాలో వైల్డ్ ఫైర్‌కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

తానొస్తే యుద్ధాలను ఆపేస్తా అన్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పనికట్టుకుని యుద్ధాలను రెచ్చగొడుతున్నారా? ట్రంప్ చేసిన రెండు ప్రకటనలు ఔననే చెబుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 12:20 PMLast Updated on: Feb 13, 2025 | 12:20 PM

Donald Trump Snesational Cooments

తానొస్తే యుద్ధాలను ఆపేస్తా అన్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పనికట్టుకుని యుద్ధాలను రెచ్చగొడుతున్నారా? ట్రంప్ చేసిన రెండు ప్రకటనలు ఔననే చెబుతున్నాయి. ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో విలీనంకాక తప్పదన్నారు. హమాస్‌కు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రెండు ప్రకటనలతో ఇటు పశ్చిమాసియాలో అటు ఉక్రెయిన్ యుద్ధభూమిలోనూ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మిడిల్ ఈస్ట్‌లో అయితే ట్రంప్ ప్రకటన పెను ప్రకంపనలే రేపుతోంది. ఇంతకూ, యుద్ధాలను ఆపేస్తా అన్న ట్రంప్ రూటు మార్చడం వెనుక వ్యూహమేంటి? ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం ఈ రెండు యుద్ధాలపై ఎలా ఉండబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..

జనవరి 19న గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ ప్రతి శనివారం తన దగ్గరున్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెడుతోంది. కానీ, గత శనివారం మాత్రం ఆ పని చేయలేదు. బందీల విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హమాస్ సాయుధ విభాగం సంచలన ప్రకటన చేసింది. తదుపరి ప్రకటన వచ్చేవరకు బందీల విడుదల ఉండబోదని హమాస్ వెల్లడించింది. మూడు వారాలలో తమ శత్రువులు కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలకు కట్టుబడడంలో విఫలం కావడం, ఉల్లంఘనలను గమనించామనీ, నిరాశ్రయులు తిరిగి ఉత్తర గాజాకు వస్తుంటే వారిపై కాల్పులు జరపడం.. మానవతా సాయం రాకుండా అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించింది హమాస్. ఈ కారణాల వల్ల ఫిబ్రవరి 15న జియానిస్ట్ ఖైదీల విడుదలను వాయిదా వేస్తున్నామని హమాస్ ప్రకటించింది. సీజ్ ఫైర్‌ తర్వాత అంతా సవ్యంగానే జరుగుతుంది అకుంటున్న వేళ ఈ నిర్ణయం కీలక మలుపుగా మారింది.

మరోవైపు.. మమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలను హమాస్ ఉల్లంఘించిందని జ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అన్నారు.
గాజాలో ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్‌ను అప్రమత్తం చేసినట్టు ప్రకటించారు. నిజానికి.. కాల్పుల విరమణ తర్వాత ఒప్పందం ప్రకారం మొత్తంగా 33 మంది ఫస్ట్ ఫేజ్‌లో విడుదల చేయాలి. అందులో 16 మందిని ఇప్పటికే విడుదల చేయగా మరో 17 మందిని విడుదల చేయాల్సి ఉంది. ఐతే, ఆ 17మందిలో 8మంది ఇప్పటికే మరణించారని ఇజ్రాయెల్ అంటోంది. అంటే 9 మందిని హమాస్ విడుదల చేయాల్సిఉంది. మరో ఒప్పందాన్ని అనుసరించి హమాస్ ఐదుగురు థాయిలాండ్ పౌరులను విడుదల చేసింది. కాగా 1900 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయడానికి కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ అంగీకరించింది. దాని ప్రకారం ఇప్పటికే వందల మందిని విడిచిపెట్టింది. ఇక ఒప్పందంలో భాగంగా రెండో దశలో మరింత మంది బందీలను విడిపించేందుకు గాను ఇజ్రాయెల్ బృందం ఖతార్ వేదికగా హమాస్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి సమయంలో హమాస్ బందీల విడుదల నిలిపివేయడం ట్రంప్‌నకు చిర్రెత్తేలా చేసింది. ఇంకేముంది.. ట్రంప్ తన టెంపర్ చూపించాలని డిసైడ్ అయ్యారు.

బందీల విడుదల నిలిపివేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ భయంకరమైన చర్యగా అభివర్ణించారు.కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయమనీ, కానీ, ఈ అంశాన్ని తాను వ్యక్తిగతంగా తీసుకున్నట్టు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయకపోతే నరకమంటే ఎలా ఉంటుందో హమాస్‌కు చూపిస్తా అన్నారు. నెతన్యాహుతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. గాజాను స్వాధీనం చేసుకుంటామని మరోసారి తేల్చి చెప్పారు. దీనికి పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్డాన్‌, ఈజిప్ట్‌లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్‌పై హమాస్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయింది. ట్రంప్ బెదిరింపులకు బెదిరిపోయేవాళ్లు ఎవరూ లేరని ఘాటుగా బదులిచ్చింది. ట్రంప్ యాక్షన్, హమాస్ రియాక్షన్‌తో గాజాలో మరో భీకర యుద్ధం తప్పదేమో అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 15న గాజాలో ఏమైనా జరగొచ్చు కూడా. ఒకవేళ గాజాలో తిరిగి యుద్ధమే మొదలైతే అది ఎక్కడివరకూ వెళుతుందో చెప్పడమూ కష్టమే. కానీ, ట్రంప్ మరో యుద్ధాన్నీ పనికట్టుకుని కెలుకుతున్నారు.

ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ యుద్ధం ముగిసి తీరాల్సిందే అని ట్రంప్ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ, ఇప్పుడా యుద్ధం విషయంలో ట్రంప్ చేసిన ప్రకటన మరోలా ఉంది. ఉక్రెయిన్ ఎప్పటికైనా రష్యాలో కలవడం ఖాయమన్నదే ట్రంప్ చేసిన సంచలన ప్రకటన. రష్యా-ఉక్రెయిన్‌ను ఉద్దేశిస్తూ.. ‘వారు ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. ఉక్రేనియన్లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ గాజాపై కన్నేశారన్నది ఓపెన్ సీక్రెట్. గాజాస్ట్రిప్‌ను అభివృద్ధి పేరుతో తమ ఆధీనంలోకి తీసుకోడానికి హమాస్‌ను బెదిరిస్తున్నారు. కానీ, ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? ఎందుకంటే, కీవ్‌పైనా ట్రంప్ కన్ను ఉంది కాబట్టి. ఉక్రెయిన్‌లోని అత్యంత విలువైన ఖనిజాలపై కన్నేసిన ట్రంప్.. ఆ దేశాన్ని తన డిమాండ్లకు తగ్గట్టుగా మలుచుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేయడం వల్ల తమకేంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్‌తో 500 మిలియన్‌ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. దీన్నిబట్టే ట్రంప్ టార్గెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన ప్రతిపాదనకు జెలెన్‌స్కీ ఓకే అంటే ఉక్రెయిన్‌కు సాయం చేస్తారు.. కాదూ కూడదంటే సాయం నిలిపేస్తారు. అప్పుడు ఉక్రెయిన్ రష్యా వశమవుతుంది. వివరంగా చెప్పాలంటే ఇదే ట్రంప్ వ్యూహం. అయినా ట్రంప్ వంటి పక్కా బిజినెస్ మ్యాన్ యుద్ధాలను ఆపుతాడు అనుకోవడం మూర్ఖత్వమే.