ఒక్క నిర్ణయంతో మూడు దేశాలు ఖతం.. ఎంత పని చేశావయ్యా ట్రంపూ?
మ్యాడ్ మ్యాన్ థియరీ.. తనను తాను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రపంచానికి చాటి చెప్పుకుంటూ అనుకున్నది సాధించడానికి అనుసరించే స్ట్రాటజీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ముందు నుంచీ చెబుతున్నట్టే కెనడా, మెక్సికో, చైనాపై టెర్రర్ టారిఫ్‌ను సంధించేశారు.
మ్యాడ్ మ్యాన్ థియరీ.. తనను తాను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రపంచానికి చాటి చెప్పుకుంటూ అనుకున్నది సాధించడానికి అనుసరించే స్ట్రాటజీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ముందు నుంచీ చెబుతున్నట్టే కెనడా, మెక్సికో, చైనాపై టెర్రర్ టారిఫ్‌ను సంధించేశారు. కెనడా, మెక్సికోలపై 25శాతం, డ్రాగన్ కంట్రీపై 10శాతం సుంకాలు విధించారు. అయితే, చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ఆ మూడు దేశాలు అదే స్థాయిలో తెంపరి ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చాయి. ఇక్కడే ప్రపంచానికి సమస్య వచ్చి పడింది. ఇలా ప్రతీకార పన్నులు విధించుకుంటూపోతే జరిగే నష్టం ఊహకు అందని రీతిలో ఉంటుందని ఎక్స్ పర్ట్స్ విశ్లేషణలు మొదలు పెట్టారు. ట్రంప్ అనుసరిస్తున్న మ్యాడ్‌మ్యాన్ థియరీతో ప్రపంచానికే ముప్పు తప్పదని వరల్డ్ బ్యాంక్ ఇటీవలే చెప్పింది. ఇంతకూ, ట్రంప్ టారిఫ్ వార్‌తో ప్రపంచానికి ఎదురుకాబోయే సవాళ్లేంటి? ప్రతీకార పన్నులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిజంగా రిస్క్‌లో పడేస్తాయా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నినాదం ఇది. ఈ స్లోగన్ ఉద్దేశం అమెరికాను అన్ని రంగాల్లో పవర్ ఫుల్‌గా మార్చడం. అందుకు ట్రంప్ ఎంచుకున్న కీలక మార్గం టారిఫ్. అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అందుకు తగ్గట్టే ట్రంప్ యాక్షన్ కనిపిస్తోంది. మొదట డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీని తెరపైకి తెస్తే 100శాతం టారిఫ్ విధిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు మిత్ర దేశం శత్రు దేశం అన్న తేడా లేకుండా ప్రతీకార పన్నులు విధిస్తూ రెచ్చిపోతున్నారు.
అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై చెప్పినట్టుగానే భారీ సుంకాలను విధించారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలకు అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధించారు. దీనికి బదులుగా ఆ మూడు దేశాలూ యాక్షన్ మార్చేశాయి. దీంతో ఈ టారిఫ్ వార్ ఎటు టర్న్ కాబోతోందో అన్న ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది.
చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతాన్ని ట్రంప్ మర్చిపోయినా కెనడా, మెక్సికో, చైనాలు మరచిపోలేదు. ట్రంప్ తప్పుడు పద్దతుల్లో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ దేశాలు.. అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. అలాగే, ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీవో సవాల్ చేస్తానని చైనా హెచ్చరించింది. మొదట కెనడా ప్రధాని ట్రూడో సీన్‌లోకి వచ్చారు. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్టు ప్రకటించారు. వాషింగ్టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందనగా చెప్పారు. ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపా రు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే.. తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికే మంచిందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడితో అయిపోలేదు.. ఈ సారి మెక్సికో సీన్‌లోకి వచ్చింది. ఎందుకంటే, మెక్సికోపై 25శాతం పన్నుతో పాటు ఆ దేశ ప్రభుత్వంపై ట్రంప్ విమర్శలు కూడా చేశారు.
కెనడా, మెక్సికోల నుంచి అమెరికాకు అక్రమ వలసలే కాదు.. మాదక ద్రవ్యాలు కూడా అక్రమంగా రవాణా అవుతాయి. ఆ రెండు దేశాలపై పన్నుల విధింపునకు రీజన్ కూడా ఇదే. మెక్సికో ప్రభుత్వానికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని ట్రంప్ ఆరోపించారు. దీనిపై రియాక్ట్ అయిన ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్.. ట్రంప్ ఆరోపణలను ఖండించారు. గడిచిన నాలుగు నెలల్లో 20 మిలియన్ డోల్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డ్రగ్ మాఫియాతో లింక్ ఉంటే ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కాన్న క్లాడియా.. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. అంటే కెనడా బాటలోనే మెక్సికో కూడా అడుగులేయబోతోందని అనుకోవచ్చు. ఇక మిగిలింది డ్రాగన్ కంట్రీ చైనా.
ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణాకు చైనానే కారణం అంటున్న ట్రంప్.. బీజింగ్‌పై 10శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై జిన్‌పింగ్ సర్కార్ తీవ్ర స్థాయిలో స్పందించింది. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందనీ.. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ట్రంప్ తెంపరితనంపై ప్రపంచ వాణిజ్య సంస్థలోనే తేల్చుకుంటాం అని హెచ్చరించింది. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయన్న బీజింగ్.. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. ఓవరాల్‌గా ఈ మూడు దేశాలు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యాక్షన్‌కి కౌంటర్ యాక్షన్ ఖాయమని తేల్చేశాయి. అయితే, తాజా సుంకాలు ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధిని 1.5శాతం తగ్గించి కెనడా, మెక్సికోలను మాంద్యంలోకి నెట్టివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కానీ, సమస్య ఇక్కడితో ముగి సినట్టు కాదు..
ట్రంప్ టారిఫ్ యాక్షన్‌లో ఇది మొదటి అడుగు మాత్రమే.. ఎందుకంటే పన్నులతోనే తమ దేశాన్ని పవర్ ఫుల్‌గా మార్చాలనుకుంటున్నారు ట్రంప్. అదే నిజమైతే అమెరికా శక్తివంతంగా మారడం మాట దేవుడెరుగు.. ప్రపంచమే షేక్ అయిపోతుంది. ఇటీవలే వరల్డ్ బ్యాంక్ ఈ వార్నింగ్ ఇచ్చింది. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవా లని అనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 0.3 శాతం పడిపోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వలన ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోతుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథా అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఒక్కసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడితే.. అంతకుమించిన సవాలు మరేదీ ఉండదు.