హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ,భారత్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన పుతిన్

"a friend in need is a friend indeed" నిజమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏదీ ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనవెంట ఉండేవారికంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 01:50 PMLast Updated on: Feb 12, 2025 | 1:50 PM

Dragon In The Indian Ocean Putin Who Gave Brahmastra To India

“a friend in need is a friend indeed” నిజమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏదీ ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనవెంట ఉండేవారికంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. దేశాల మధ్య, దేశాధినేతల మధ్య అలాంటి స్నేహం ఉంటే అసలు సమస్యలనేవే ఉండవు. మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్ర దేశం రష్యా. తాజాగా మరోసారి రష్యా దాన్ని రుజువు చేసింది. పొరుగు దేశాల నుంచి రక్షణ సవాళ్లు ఎదురవుతు న్న వేళ.. భారత్‌ రక్షణకు మరో బ్రహ్మాస్త్రాన్ని అందించేందుకు సిద్ధమైంది. భారత్ పోరాటం తన మిత్ర దేశం చైనాపైనే అని తెలిసి కూడా అతిపెద్ద రక్షణ వ్యవస్థను మనకు ఆఫర్ చేసింది. ఇంతకూ, పొరుగు దేశాల నుంచి పెను సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్‌కు పుతిన్ ఇస్తున్న అభయహస్తం ఏంటి? రష్యాతో భారత్ ఇప్పుడే ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

అమన్-2025.. ఇండియా అడ్డా హిందూ మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రారంభించిన యుద్ధ విన్యాసాలకు పెట్టిన పేరిది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ విన్యాసాల్లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిల్లో అమెరికా జపాన్‌, ఇటలీ, మలేషియా తదితర దేశాలున్నాయి. తాజాగా ఈ యుద్ధ విన్యాసాల్లో చైనా కూడా భాగమైంది. హిందూ మహా సముద్రంలో చైనా బలోపేతం అవుతున్న వేళ.. ఈ పరిణామాలు మరింత ఆందోళనకరంగా మారాయి. హిందూ మహాసముద్రంలో యాంటీ పైరసీ ఆపరేషన్లను నిర్వహించడం, సముద్రమార్గాల సంరక్షణ కోసం చైనా వీటిల్లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌, హెలికాఫ్టర్‌, మెరైన్‌ దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీరితోపాటు చైనాకు చెందిన సీనియర్‌ మిలిటరీ అధికారులు హాజరయ్యారు. ఇక్కడే భారత్ రక్షణ వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

ఇటీవలే పరిశోధనల పేరిట చైనాకు చెందిన రెండు భారీ నౌకలు అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. వీటిని లాన్‌హై 101, 201గా గుర్తించారు. ఈ విషయాన్ని ఓపెన్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు డామియన్‌సైమన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. మారిటైమ్‌ ఇంటెలిజెన్స్‌ సేకరణ కోసమే బీజింగ్‌ వీటిని పంపినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకలు తమ మత్స్యకార బోట్లకు అదే సమయంలో మిలిటరీకి అవసరమైన సమాచారం సేకరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నౌకలకు మాల్దీవుల్లోని చైనా అనుకూల ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. లాన్‌ హై 101లో అండర్‌ వాటర్‌ డ్రోన్లు, రిమోట్‌ వెస్సల్స్‌ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇవి సముద్రగర్భాన్ని మ్యాపింగ్‌ చేస్తాయని చెబుతున్నారు. ఇది భారత్‌కు మరింత ఆందోళన కరం.

మరోవైపు.. ఇటీవలే చైనా టిబెట్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సైనిక విన్యాసాలు చేసింది. కఠిన భౌగోళిక పరిస్ధితుల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్‌ సరఫరాపై కేంద్రీకరిస్తూ పీఎల్‌ఏ సైనిక విన్యాసాలను నిర్వహించింది. అదికూడా జనవరి 15న ఇండియన్‌ ఆర్మీ డేకి ముందే ఈ విన్యాసాలు చేయడాన్ని రక్షణ నిపుణులు వ్యూహాత్మక చర్యగా విశ్లేషించారు. ఈ విన్యాసాలను షింజియాంగ్‌ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్‌ నిర్వహించింది. ఇందులో అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్‌ టెర్రైన్‌ వెహికల్స్‌, డ్రోన్లు, అన్‌ మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, ఎక్సో స్కెలిటెన్స్‌ వంటివి వినియోగించారు. యుద్ధ సమయంలో అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో దళాలకు పరికరాలు, ఆహారం వేగంగా సరఫరా చేయడం వీటిలో ప్రధాన భాగం. ఇవన్నీ గమని స్తే.. చైనా యుద్ధ విన్యాసాల వెనుక భారీ యుద్ధ సన్నాహాలున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే నిజమైతే భారత రక్షణ మాటేంటి? ఆ బాధ్యత తనదే అంటున్నారు పుతిన్.

క్లబ్ ఎస్ మిస్సైల్ సిస్టమ్.. భారత్‌-రష్యా మధ్య జరిగిన బిడ్ డీల్ ఇదే. ఈ మిస్సైళ్లని ప్రత్యేకించి సబ్‌మెరైన్ల కోసం రూపొందించారు. 20కోట్ల డాలర్ల విలువైన 20 క్షిపణి వ్యవస్థల్ని రష్యా మన దేశ రక్షణ కోసం ఇవ్వబోతోంది. ఇవి ప్రపంచంలోనే అత్యాధుని యాంటీ క్రూయిజ్ క్షిపణులు. ఒక్కో క్లబ్‌ ఎస్-క్షిపణి వ్యవస్థకీ 400 కిలోల మందుగుండును మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. 300 కిలోమీటర్ల దూరంలో ఉండే సముద్ర, భూ లక్ష్యాలను ఈ క్షిపణులు ధ్వంసం చేస్తాయి. అంతేకాదు.. ఈ యాంటీ క్రూయిజ్ మిస్సైళ్లు ధ్వని వేగాన్ని మించి లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. అందుకే వీటిని శత్రువులు అడ్డుకోవడం ఇంపాజిబుల్. ఇటీవల కాలంలో హిందూ మహా సముద్రంలో రెచ్చిపోతున్న చైనాకి చెక్ పెట్టడంలో ఈ క్షిపణి వ్యవస్థలు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయి. సింధుఘోష్-క్లాస్ జలాంతర్గాముల్లో ఈ క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేయబో తున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో చైనా హద్దుమీరితే ఈ మిస్సైళ్లను సంధించి డ్రాగన్ అంతు చూడొచ్చు. కష్ట కాలంలో భారత్‌కు రష్యా ఇచ్చిన భారీ రక్షణ వ్యవస్థగా వీటిని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఇవి భారత నేవీ చేతికి చిక్కితే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కథ ముగిసినట్టే.