Raghunandan: బీజేపీలో మళ్లీ కొత్త లుకలుకలు.. రఘునందన్ డిమాండ్లు ఏంటి ?
ఒకప్పటి కాంగ్రెస్‌లా తయారయింది ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి. పార్టీ అధ్యక్షుడి తిట్టే వాళ్లు ఒకరు.. పార్టీలో మార్పులు కావాలి అంటూ పోస్టులు పెట్టేవాళ్లు ఇంకొకరు.. అసంతృప్తితో అలకపాన్పు ఎక్కేవాళ్లు మరొకరు.

Dubbaka BJP MLA Raghunandan Rao has written a letter to BJP leaders
ఆగమాగం తయారయింది పార్టీలో పరిస్థితి. తెలంగాణ బీజేపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈటల వర్సెస్ బండి వర్గం అంటూ జరుగుతున్న అంతర్గత పోరు అంతా ఇంతా కాదు. ఇది కంటిన్యూ అవుతుండగానే.. పార్టీలో అసంతృప్త జ్వాలలు రేగాయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూల్ అవకముందే.. ఇప్పుడు రఘునందన్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు రఘునందన్ దూరంగా ఉంటున్నారు. బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత కావాలని.. ఢిల్లీ పెద్దలకు రఘునందన్ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తనకు ఫ్లోర్ లీడర్ అవకాశం కల్పించాలని అడుగుతున్నా పట్టించుకోవట్లేదని రఘునందన్ అంటున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కావాలని కోరినా.. రియాక్షన్ లేదని సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాతే.. తెలంగాణలో కమలం పార్టీకి హైప్ వచ్చిందని.. తెలంగాణలో పార్టీకి జోష్ రావడానికి తానే కారణమని రఘునందన్ తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అలాంటిది తనకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అలకపాన్పు ఎక్కినట్లుగా తెలుస్తోంది.
పార్టీలోకి తన తర్వాత వచ్చిన ఈటల, రాజగోపాల్ రెడ్డిలాంటి వారిని తరచూ పిలిచి మాట్లాడుతున్నారని.. తనను మాత్రం పక్కన పెట్టారని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌కు రాసిన లేఖలో రఘునందన్ ప్రధానంగా మూడు డిమాండ్లు పెట్టినట్లుగా సమాచారం. ఒకటి జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వడం.. రెండు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం.. మూడు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఛాన్స్. పార్టీ కోసం తాను పనిచేయాలంటే.. ఈ డిమాండ్లను కచ్చితంగా పరిశీలించాలని రఘునందన్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అసలే తెలంగాణలో అనుకోని ఇబ్బందుల్లోకి వెళ్లిన బీజేపీ.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.