ysrcp Politics: గన్నవరంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా.?
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత రాజకీయ ఆసక్తిని రేపుతున్ననియోజకవర్గం గన్నవరం. చాలాకాలంగా ఇక్కడ రాజకీయ చదరంగం నడుస్తోంది. అదికూడా అధికారపక్షంలోనే.. ఎత్తులు పైఎత్తుల మధ్య రాజకీయం రోజురోజుకు రగులుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార వైసీపీ ఈ సీటుపై ఆశలు కోవాల్సినట్లే కనిపిస్తోంది.
గన్నవరం సీటును నిలబెట్టుకోవాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ పరిస్థితులు కలసి రావడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వల్లభనేని వంశీ, వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. వల్లభనేని స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ఆ తర్వాత సీన్ మారింది. వంశీ వైసీపీలోకి వచ్చారు. కానీ ఆ వైరం మాత్రం పోలేదు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, దుట్టా రామచంద్రరావు ముగ్గురూ మూడు దిక్కులయ్యారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. ఆ తర్వాత యార్లగడ్డ, దుట్టా చేతులు కలిపారు. వంశీకి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈసారి కూడా వంశీకి సీటు గ్యారెంటీ అని తేలడంతో యార్లగడ్డ టీడీపీలోకి జంపైపోయారు. అయితే దుట్టా మాత్రం సైలెంటైపోయారు. వైసీపీలోనే ఉన్నా లేనట్లే అన్నట్లున్నారు.
ఫలించని బాలశౌరి రాయబారం..!
దుట్టా రామచంద్రరావును యాక్టివ్ చేసి వంశీ విజయానికి సహకరించేలా చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆయనతో మంచి సంబంధాలున్న ఎంపీ బౌలశౌరిని బుజ్జగింపులకు పంపింది. వంశీ విజయానికి సహకరించాలని దుట్టాను కోరారు బాలశౌరి. పార్టీ ఆయన్ను గౌరవిస్తుందని మళ్లీ అధికారంలోకి వస్తే మంచి పదవిని ఇస్తామని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే దుట్టామాత్రం బౌలశౌరికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. నిజానికి వంశీ చేసిన పరాభవాన్ని దుట్టా మర్చిపోలేకపోతున్నారు. దుట్టాను వంశీ తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. ఒకే పార్టీలో ఉన్నా ఆయన్నో శత్రువులా చూశారు. ఆయన వర్గానికి ఏ మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. పార్టీ పెద్దలు చెప్పినా వంశీ పట్టించుకోలేదు. దీంతో దుట్టా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దాన్ని ఆయన మర్చిపోలేదు. ఇన్నాళ్లు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చేతులు కలపమంటే ఎలా అంటూ ఆయన గట్టిగానే బౌలశౌరిని అడిగినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే సీఎం జగన్‌ను కలిసి తాను చెప్పాల్సిందంతా చెప్పేశానన్నారు. దీంతో బౌలశౌరి వట్టి చేతులతో వెనుతిరగాల్సి వచ్చింది. పైకి మాత్రం దుట్టా పార్టీ విజయానికి పనిచేస్తారంటూ రొటీన్ డైలాగులు కొట్టి వెళ్లిపోయారు.
దుట్టా ఏం చేయబోతున్నారు..?
దుట్టా ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. మౌనంగా అయినా ఉంటాను కానీ వంశీకి మాత్రం సహకరించనని ఆయన తెగేసి చెబుతున్నారు. మరోసారి వంశీ గెలిస్తే రాజకీయంగా తాను సమాధి అయిపోయినట్లేనని ఆయనకు తెలుసు. అందుకే చేజేతులా శత్రువుకు గెలుపు కట్టబెట్టకూడదని భావిస్తున్నారు. ఇంతకాలం తనకు మిత్రుడుగా ఉన్న యార్లగడ్డకు సహకరిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. పార్టీలోనే ఉంటూ ఆయనకు సహకరించడం కూడా సరికాదని ఆయన భావిస్తున్నారు. అందుకే కేడర్ నిర్ణయానికే వదిలేయాలనుకుంటున్నారు. వాళ్లు వంశీకి సహకరిస్తే ఓకే లేకుండా యార్లగడ్డ కోసం పనిచేసినా పట్టించుకోకూడదన్నది దుట్టా ఆలోచనగా కనిపిస్తోంది. ఆయన అనుచరులు మాత్రం యార్లగడ్డకే మద్దతిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఇది వైసీపీ ఏ మాత్రం మంచి సంకేతం కాదు.
గన్నవరంలో పరిస్థితి చేయిజారిపోతోందని వైసీపీ హైకమాండ్‌కు ఎప్పుడో తెలుసు. అయినా పట్టించుకోలేదు. వంశీని కంట్రోల్ చేయలేదు. ఫలితంగా ఇప్పుడు సీటుకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. టీడీపీ పుంజుకోవడంతో వైసీపీకి ప్రతిసీటూ కీలకమే. అధికారంలోకి రావాలంటే దేన్నీ తేలిగ్గా తీసుకోకూడదు. అందుకే ఇప్పుడు గన్నవరంపై ఫోకస్ పెట్టింది. కానీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు. అదే పార్టీ హైకమాండ్‌ను టెన్షన్ పెడుతోంది. చూడాలి మరి గన్నవరాన్ని వైసీపీ ఎలా డీల్ చేస్తుందో…!