మయన్మార్ కు భూకంపాలు కామన్..?
శుక్రవారం ఉదయం మయన్మార్ లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చే సంకేతాలు కనపడుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు మయన్మార్‌ను రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం కుదిపివేసిందని

శుక్రవారం ఉదయం మయన్మార్ లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చే సంకేతాలు కనపడుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు మయన్మార్‌ను రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం కుదిపివేసిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం తీవ్రత 7.7గా నమోదైందని, ఇది భారతదేశం, బంగ్లాదేశ్, లావోస్, మయన్మార్, థాయిలాండ్ మరియు చైనాలను ప్రభావితం చేసిందని తెలిపింది.
1.2 మిలియన్ల మంది ప్రజలు నివాసం ఉండే మాండలే నగరం నుండి దాదాపు 17.2 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించారు. మధ్యాహ్నం 12.02 గంటల ప్రాంతంలో, దేశాన్ని 6.4 తీవ్రతతో మరో భూకంపం తాకింది. సాగింగ్‌కు దక్షిణంగా 18 కి.మీ దూరంలో, భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత కారణంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. భారీ భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటుగా పలు రోడ్లు నాశనం అయ్యాయి.
పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మయన్మార్ సైనికాధికారులు ‘అత్యవసర పరిస్థితి’ ప్రకటించి అంతర్జాతీయ సహాయం కోరారు. బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో మరియు రైలు సేవలు నిలిపివేశారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ తెలిపింది. బెంగాల్‌లోని కోల్‌కతా, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకా, చటోగ్రామ్‌లలో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయని జాతీయ మీడియా పేర్కొంది.
భూకంప ప్రభావిత దేశాలకు అవసరమైన ఏ సహాయం అందించడానికి అయినా భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మయన్మార్‌లో భూకంపాలు చాలా సాధారణంగా చెప్తారు. ఇక్కడ 1930 మరియు 1956 మధ్య.. ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్న సాగింగ్ ఫాల్ట్ సమీపంలో 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు బలమైన భూకంపాలు సంభవించాయి. 2016లో మధ్య మయన్మార్‌లోని పురాతన రాజధాని బగాన్‌లో 6.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వైద్య వ్యవస్థ బలహీనంగా ఉండటంతో.. భూకంప పరిస్థితిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహాయం కోరుతోంది మయన్మార్.