Election Code: ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి..!
సోమవారం నుంచే ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు తీసుకుంటారు. ఈ కోడ్ అమలులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆంక్షలుంటాయి.
Election Code: కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. సోమవారం నుంచే ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు తీసుకుంటారు. ఈ కోడ్ అమలులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆంక్షలుంటాయి.
గతంలో ప్రారంభించిన పథకాల విషయంలో కూడా ఫిర్యాదులు అందితే.. ఎన్నికల సంఘం అధికారులు ఆంక్షలు విధిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. అందరూ ఎన్నికల నియమావళిని పాటించాలి. చివరకు ప్రధానికి, ముఖ్యమంత్రికి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకుంటుంది. భారీ ఎత్తున జరిగే నగదు లావాదేవీలపై ఈసీ నిఘా ఉంటుంది. ప్రజలు కూడా భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లడానికి వీలులేదు. రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తూ ఉంటే.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు రశీదులు వంటివి తప్పనిసరిగా ఉండాలి. లేదంటో పోలీసులు, ఈసీ అధికారులు వాటిని సీజ్ చేస్తారు. ఇండ్లల్లో కూడా భారీ మొత్తంలో నగదు ఉంచుకోవడానికి వీల్లేదు. డబ్బులు మాత్రమే కాదు.. బంగారం, వెండి ఆభరణాలు, మద్యం వంటివి అధికంగా కలిగా ఉన్నా వాటికి సంబంధించిన రశీదులు తప్పనిసరిగా ఉండాలి.
అధికారులు ఎప్పుడైనా, ఎక్కడైనా తనిఖీ చేస్తారు కాబట్టి, ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఒకవేళ స్వాధీనం చేసుకున్నప్పటికీ.. తర్వాతైన సంబంధిత పత్రాలు సమర్పించి, వాటిని విడిపించుకోవచ్చు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటే నాయకులతోపాటు అధికారులు, సామాన్యులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.